Asian Champions Trophy 2024: చైనాపై విక్టరీ... ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ‌ని నిలబెట్టుకున్న భారత హాకీ జట్టు

India defeated China in a hard fought final of the Asian Champions Trophy 2024

  • హోరాహోరీ ఫైనల్‌‌లో చైనాపై 1-0 తేడాతో విక్టరీ
  • చివరి క్వార్టర్‌లో గోల్ సాధించిన డిఫెండర్ జుగ్‌రాజ్
  • ఐదవసారి టైటిల్‌ను ముద్దాడిన టీమిండియా

హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ-2024ను భారత్ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆతిథ్య చైనాను 1-0 తేడాతో టీమిండియా మట్టికరిపించింది. దీంతో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని వరుసగా రెండవసారి, మొత్తంగా ఐదవసారి భారత్ గెలుచుకుంది.

చైనాలోని హులున్‌బుయిర్‌లో ఉన్న మోకీ ట్రైనింగ్ బేస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ ఆద్యంతం అద్భుతంగా ఆడింది. మొదటి మూడు క్వార్టర్స్‌లో గోల్ సాధించేందుకు భారత ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలను చైనా గోల్ కీపర్ వాంగ్ ఫీల్డ్ అడ్డుకున్నాడు. భారత ప్లేయర్లు ఎత్తుగడలతో ఎటాకింగ్‌గా ఆడినప్పటికీ అన్నింటినీ నిలువరించాడు. పెనాల్టీ కార్నర్లను సైతం వాంగ్ ఫీల్డ్ విజయవంతంగా అడ్డుకున్నాడు. అయితే ఆఖరిదైన చివరి క్వార్టర్‌లో భారత ఆటగాళ్లు ప్రణాళికాబద్ధంగా ఆడి గోల్ సాధించారు. 

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ బంతిని అద్భుత రీతిలో డిఫెండర్ జుగ్‌రాజ్‌కి అందించాడు. దీంతో జుగ్‌రాజ్ అదిరిపోయే స్ట్రైక్‌‌తో బంతిని చైనీస్ గోల్ కీపర్‌ను దాటించి పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఉత్కంఠకు తెరపడి భారత్ విజయాన్ని అందుకుంది. 

మొదటి మూడు క్వార్టర్స్ లో గోల్ సాధించలేకపోయినా, భారత ఆటగాళ్లు నిరాశ పడకుండా సానుకూల దృక్పథంతో ఆడారు. ఏకైక గోల్ సాధించడంలో వ్యూహాత్మకంగా ఆడారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్... జుగ్‌రాజ్‌కి బంతిని పాస్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చైనా ప్లేయర్లు భారత ఎటాకింగ్ ప్లేయర్ల చుట్టూ తిరుగుతూ అడ్డుతగులుతుండడంతో బంతిని తెలివిగా డిఫెండర్ జుగ్‌రాజ్‌కు కెప్టెన్ అందించాడు. ఈ ప్రయత్నం భారత్‌కు గోల్‌ సాధించిపెట్టింది.

  • Loading...

More Telugu News