New Liquor Policy: ఏపీలో అక్టోబరు 1 నుంచి నూతన మద్యం విధానం... త్వరలో అధికారిక ప్రకటన

New liquor policy in AP will be implemented from Oct 1

  • ఏపీలో ఈ నెలాఖరుతో ముగియనున్న ప్రస్తుత మద్యం విధానం
  • చంద్రబాబుకు నివేదిక అందించిన మంత్రివర్గ ఉపసంఘం
  • తక్కువ ధరకే నాణ్యమైన మద్యం విక్రయిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీలో ఈ నెలాఖరుతో ప్రస్తుత మద్యం విధానం ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం విధానం కోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం నేడు సీఎం చంద్రబాబుతో సమావేశమై, నివేదికను అందించింది. రేపు కేబినెట్ ముందు నూతన మద్యం విధానం ప్రతిపాదనలు ఉంచుతామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

కాగా, రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. దీనిపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం విక్రయిస్తామని వెల్లడించారు. తొలిసారి కల్లుగీత కార్మికులకు 10 శాతం దుకాణాలు కేటాయిస్తామని చెప్పారు. 

కొత్త పాలసీ ప్రకారం... వైన్ షాపులను లాటరీ ద్వారా కేటాయిస్తారని, వైన్ షాపులు కేటాయించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తామని కొల్లు రవీంద్ర వివరించారు. మద్యంపై పన్నులను కూడా సవరిస్తామని వెల్లడించారు. 

గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను సర్వనాశనం చేసిందని విమర్శించారు. అక్రమ మద్యం విధానం అమలుకు గత ప్రభుత్వం సెబ్ ను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్లు విక్రయించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మద్యం నియంత్రణ అని చెప్పి, ప్రజల జేబులు ఖాళీ చేశారని అన్నారు. 

అర్హతలేని వ్యక్తిని డిప్యుటేషన్ పై తీసుకువచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టారని, నకిలీ మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంపై దెబ్బకొట్టారని వివరించారు. జే బ్రాండ్ల కోసం డిస్టిలరీలను వైసీపీ తన చేతుల్లోకి తీసుకుందని, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.19 వేల కోట్లు వైసీపీ పెద్దల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు.

New Liquor Policy
Andhra Pradesh
Kollu Ravindra
TDP
YSRCP
  • Loading...

More Telugu News