ICC World Cups: మహిళల వరల్డ్ కప్‌ ప్రైజ్ మనీపై ఐసీసీ కీలక ప్రకటన

ICC has made a historic decision of equalling the prize money for the mens and womens World Cups

  • ప్రపంచ కప్‌లలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నట్టు ప్రకటన
  • వచ్చే నెలలో జరగనున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌ ప్రైజ్‌మనీ భారీగా పెంపు
  • చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి

ప్రపంచ కప్‌ల ప్రైజ్‌మనీకి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచ కప్ 2024తో మొదలుకొని తదుపరి అన్ని ప్రపంచ కప్‌లలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్ మనీ ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు చారిత్రాత్మక నిర్ణయాన్ని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. 

వచ్చే నెలలో జరగనున్న ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీని ఐసీసీ గణనీయంగా పెంచింది. ఏకంగా 225 శాతం మేర హెచ్చించింది. దీంతో టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 7,958,000 డాలర్లకు ( సుమారు రూ.66.64 కోట్లు) చేరింది.

మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ఈ ఏడాది తొలి ఐసీసీ టోర్నమెంట్ అని, ఈ టోర్నమెంట్‌లో పురుషులతో సమానంగా మహిళలు ప్రైజ్ మనీని అందుకుంటారని స్పష్టం చేసింది. క్రికెట్ చరిత్రలో ఇదొక కీలకమైన మైలురాయి అని ఐసీసీ పేర్కొంది. కాగా 2023 జులైలో జరిగిన వార్షిక కాన్ఫరెన్స్‌లో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 

2030 నాటికి పురుషుల, మహిళల జట్లకు సమాన ప్రైజ్ మనీ ఇవ్వాలని భావించినప్పటికీ... ఏడేళ్లు ముందుగానే ఐసీసీ ఈ కీలక నిర్ణయాన్ని అమలు చేస్తోంది. సెమీ ఫైనలిస్టులు, గ్రూప్ స్టేజ్ మ్యాచ్ విన్నర్ల ప్రైజ్ మనీని కూడా పెంచినట్టు ఐసీసీ పేర్కొంది. ఈ చర్య మహిళా క్రికెటర్లను ప్రోత్సహిస్తుందని తెలిపింది.

ఐసీసీ ప్రకటనతో మహిళల టీ20 ప్రపంచ కప్ విజేత జట్టు నగదు బహుమతి 1 మిలియన్ డాలర్లు నుంచి 23,40,000 డాలర్లకు పెరిగింది. భారతీయ కరెన్సీలో ఈ విలువ రూ.19.6 కోట్లుగా ఉంది. విజేత ప్రైజ్ మనీ134 శాతం మేర పెంచినట్టు అయ్యింది. 

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ నెలలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత్ జట్టు నగదు బహుమతిగా 2.45 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20.52 కోట్లు) పొందింది.

More Telugu News