Nandi Power: ట్రెడ్ మిల్ పై ఎద్దు నడుస్తుంటే కరెంటు పుడుతుంది... వినూత్న ప్రాజెక్టు వివరాలు ఇవిగో!
- చింతా శశిధర్ ఫౌండేషన్ నూతన సృష్టి
- నంది పవర్ ఆవిష్కరణ
- ప్రస్తుతం అభివృద్ధి దశలో నంది పవర్
ట్రెడ్ మిల్ ను ఎందుకు ఉపయోగిస్తారో మనందరికీ తెలిసిందే. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అవుట్ డోర్ వాకింగ్ కు వెళ్లలేని వారికి ఇంట్లోనే నడిచేలా ట్రెడ్ మిల్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
అయితే, ట్రెడ్ మిల్ తో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంటే ఆశ్చర్యం కలగకమానదు. అది కూడా, ట్రెడ్ మిల్ పై ఓ ఎద్దు నడుస్తుంటే... కరెంటు పుడుతుందట! ఇది నిజంగా అద్భుతమే అనిపిస్తుంది. దీన్ని 'నంది పవర్' అని పిలుస్తున్నారు. చింతా శశిధర్ ఫౌండేషన్ కు చెందిన 'నంద గోకులం' ఈ 'నంది పవర్' ను ఆవిష్కరించింది. ఓ ట్రెడ్ మిల్ పై ఎద్దు స్థిరమైన వేగంతో నడుస్తూ ఉంటే ఉత్పన్నమయ్యే శక్తి కరెంటుగా మారుతుంది.
నంది పవర్- వెర్షన్ 1 వివరాలు...
దీని బరువు 1 టన్ను వరకు ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన బ్రేకింగ్ వ్యవస్థ కూడా ఉంది. ఎద్దుల రక్షణ కోసం ఈ బ్రేకులు అమర్చారు. ప్రత్యేకంగా హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది. ఈ ట్రెడ్ మిల్ ఎత్తును సర్దుబాటు చేసుకోవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా హైడ్రాలిక్ లిఫ్ట్ సిస్టమ్ ను అమర్చారు.
అభివృద్ధి దశలో నంది పవర్
ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉంది. నెల్లూరులో 50 ఎద్దులతో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఒక ట్రెడ్ మిల్ సాయంతో 5 కిలోవాట్లు, అంతకంటే ఎక్కువ విద్యుత్ ను ఉత్పత్తి చేయాలన్నది చింతా శశిధర్ ఫౌండేషన్ లక్ష్యం.
రైతులకు అందుబాటులో...
ఈ నంది పవర్ ట్రెడ్ మిల్ ను దేశవ్యాప్తంగా రైతులకు, ఎద్దుల యజమానులకు అందుబాటులోకి తీసుకురావాలని ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది. కష్టతరమైన వ్యవసాయ పనులు, ఇతర బరువు పనులతో పోల్చితే ఎద్దులకు ఈ ట్రెడ్ మిల్ పై నడవడం ఎంతో సులువు అని చింతా శశిధర్ ఫౌండేషన్ అభిప్రాయపడుతోంది.
దేశీయంగానే తయారు
ఈ వినూత్న ట్రెడ్ మిల్ ను దేశీయంగానే అభివృద్ధి చేశారు. వీఎస్ గ్రూప్ మెకానికల్ టీమ్ ఈ ట్రెడ్ మిల్ తయారీలో పాలుపంచుకుంది.