Allu Arjun: ఇంతకీ.. అల్లు అర్జున్‌ తదుపరి చిత్రం ఏది?

Why doubt about Allu Arjun s next film

  • బన్నీ తదుపరి చిత్రంపై ఊహగానాలు 
  • త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నెక్స్ట్‌ సినిమా 
  • పుష్ప-2 విడుదలకు ముందే ఓపెనింగ్‌

పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఇప్పుడు అల్లు అర్జున్‌ చిత్రాలకు అన్ని భాషల్లోనూ మంచి డిమాండ్‌ వుంది. ఇక ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప-2 ది రూల్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ యువ కథానాయకుడు. గత రెండేళ్ల నుంచి ఈ చిత్రం షూటింగ్‌లో వున్నాడు. చిత్రీకరణ చివరి దశలో వున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. అయితే పుష్ప-2 ది రూల్‌ తరువాత ఈ అల్లు హీరో ఏ చిత్రంలో నటించనున్నాడని గత కొన్ని రోజులుగా ఊహగానాలు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించే సినిమా పట్టాలెక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

దీంతో పాటు త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే ఆయన తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడని అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో అల వైకుంఠపురంలో సాధించిన రికార్డు వసూళ్లు బన్నీ కెరీర్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప-2 తరువాత అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే సినిమా చేసే అవకాశాలున్నాయని చెబుతున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. 

ఇటీవల అర్జున్‌ స్నేహితుడు బన్నీవాస్‌ కూడా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఈ ప్రకారం చూస్తే పుష్ప-2 విడుదలకు దగ్గర్లోనే అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కబోయే చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుందని అర్జున్‌ సన్నిహితులు చెబుతున్నారు. అయితే అట్లీ దర్శకత్వంలో సినిమా కూడా వుంటుందని, త్రివిక్రమ్‌తో సినిమా పూర్తవగానే ఆ సినిమా చిత్రీకరణ వుంటుందని టాలీవుడ్‌ ఇన్‌సైడ్ న్యూస్‌.

  • Loading...

More Telugu News