Ravichandran Ashwin: ఆటగాళ్లకు రవిశాస్త్రి స్పెషల్ డిన్నర్ ఇచ్చిన వేళ...!
- 2020-21 సీజన్ లో అడిలైడ్ లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం
- 36 పరుగులకే భారత్ ఆలౌట్
- రవిశాస్త్రి క్రీడాకారులకు స్పెషల్ డిన్నర్ ఇచ్చి ఉత్సాహపరిచాడన్న రవిచంద్రన్ అశ్విన్
- ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని టెస్టు సిరీస్ కైవసం చేసుకున్నట్లు వెల్లడి
2020-21 సీజన్ లో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌లు, మూడు టీ 20లు ఆడేందుకు అక్కడికి భారత్ వెళ్లింది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 2020లో జరిగిన పొట్టి సిరీస్ ను 1-2 తేడాతో టీమిండియా కోల్పోయింది. ఇక నాలుగు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లోనే ఘోర పరాజయం చవిచూసింది. 36 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెటర్లు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ కూడా స్వదేశానికి బయలుదేరి వచ్చారు.
ఆ సమయంలో ఏం జరిగింది? బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని భారత్ ఎలా కైవసం చేసుకుంది? అప్పటి ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎలాంటి పాత్ర పోషించారు? అనే విషయాలను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. నాడు అప్పటి ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక పాత్ర పోషించారని, ప్లేయర్స్‌లో ఉత్సాహం నింపేందుకు తీవ్రంగా ప్రయత్నించారని అశ్విన్ చెప్పాడు.
అప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే అసలు సిరీస్ గెలుస్తామని అనుకోలేదని అశ్విన్ పేర్కొన్నాడు. అడిలైడ్ టెస్టులో ఘోర ఓటమి తర్వాత క్రికెటర్లు తీవ్ర నిరాశలో కూరుకుపోయారన్నాడు. అయితే అప్పటి ప్రధాన కోచ్ రవి శాస్త్రి ఆ రోజు సాయంత్రం క్రికెటర్లకు డిన్నర్ ఏర్పాటు చేయడంతో పాటు అందులో అతను పాటలు పాడటం ప్రారంభించారన్నారు. దాంతో నెమ్మదిగా ఒక్కరొక్కరం ఆయన్ను అనుసరించామని దీంతో ఓటమి బాధ నుండి కాస్త తేరుకున్నామన్నాడు.
కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లిపోవడంతో మిగతా టెస్ట్ సిరీస్‌లో ఎలా ఆడాలి అనే దానిపై చర్చించుకున్నామని తెలిపాడు. సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాలని నిర్ణయించుకుని, మెల్‌బోర్న్‌లో విజయం సాధించామని తెలిపాడు. ముందుగా తాము సిరీస్‌ను సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టలేదని, చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగామని చెప్పాడు.
ఒక్కో మ్యాచ్ ను గెలవడంపైనే ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు చేశామని వెల్లడించాడు. దీంతో రెండో మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ .. మూడో టెస్ట్ ను డ్రా చేసుకుంది. ఇక సిరీస్ విజేతను తేల్చే నాలుగో మ్యాచ్ విజయంతో టీమిండియా అద్భుతం చేసింది. టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.