Virat Kohli: భారత శిబిరంలో ఆందోళన... నెట్స్ లో బుమ్రా, గుర్నూర్ బౌలింగ్‌లో సరిగా ఆడలేకపోయిన కోహ్లీ!

star batter Virat Kohli found it difficult to bat against Jasprit Bumrah and Gurnoor Brar in Nets

  • ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా, గుర్నూర్ బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డ విరాట్
  • ఆకట్టుకోలేకపోయిన స్టార్ బ్యాటర్
  • బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ముందు భారత శిబిరంలో కలవరం

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య చెన్నై వేదికగా గురువారం తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చిదంబరం స్టేడియంలో ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇవాళ (సోమవారం) ఆటగాళ్లు తీవ్రంగా కసరత్తులు చేశారు. నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపారు. అయితే నేటి ప్రాక్టీస్ సెషన్‌లో చోటుచేసుకున్న పరిణామాలు భారత్ శిబిరాన్ని ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నెట్ ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన పొడగరి బౌలర్ గుర్నూర్ బ్రార్‌ బౌలింగ్‌లలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరిగా ఆడలేకపోయాడని తెలుస్తోంది. వీరి బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం కోహ్లీకి కష్టంగా అనిపించిందని ‘స్పోర్ట్‌స్టార్’ కథనం పేర్కొంది. 

బుమ్రా సంధించిన బంతులను ఎదుర్కొనేందుకు కోహ్లీ తెగ ఇబ్బందులు పడ్డాడని, బుమ్రా వేసిన ఒక బంతి విరాట్ డిఫెన్స్‌ను దాటి లోపలికి వెళ్లిందని పేర్కొంది. ఔట్ అంటూ బుమ్రా అప్పీల్ చేయగా... లెగ్-స్టంప్ మిస్ అయిందంటూ కోహ్లీ సమాధానం ఇచ్చాడని తెలిపింది.

ఇక, బంగ్లాదేశ్‌ జట్టులో 6 అడుగుల 5 అంగుళాల పొడవనున్న నహిద్ రాణా అనే పేసర్ ఉన్నాడు. అతడి బౌలింగ్‌లో ఎలాంటి ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రాక్టీస్ కోసం దాదాపు అంతే ఎత్తు ఉండే యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌ను ప్రత్యేకంగా భారత శిబిరంలో ప్రాక్టీస్ బౌలర్‌గా జట్టుతో ఉంచారు. 6 అడుగుల 4 అంగుళాల పొడవున్న బ్రార్‌ బౌలింగ్‌లో ఆడేందుకు కూడా కోహ్లీకి బాగా కష్టమైందని ‘స్పోర్ట్స్‌స్టార్’ కథనం పేర్కొంది. ఒక బంతిని కోహ్లీ ఫ్రంట్ ఫుట్‌లో ఆడాలని చూశాడని, కానీ అది ఎక్కువ బౌన్స్ అయ్యి విరాట్‌ని ఇబ్బంది పెట్టిందని పేర్కొంది.

మరోవైపు ప్రాక్టీస్ సెషన్‌లో రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, పేసర్ మహమ్మద్ సిరాజ్‌తో పాటు స్థానిక బౌలర్లు కూడా బంతులు విసిరారు. కాగా ప్రాక్టీస్ పిచ్‌పై మంచి బౌన్స్ లభించింది. టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్ జట్టుకు మరో రెండు ప్రాక్టీస్ సెషన్లు ఉన్నాయి. 

చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో భారత్ జట్టు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిన్నర్ల కోటాలో అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్‌.. పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News