Arvind Kejriwal: కేజ్రీవాల్ రాజీనామాకు ముహూర్తం ఖరారు!

AAP Chief Kejriwal Kejriwal likely to submit his resignation during the meeting with the Lieutenant Governor tomorrow

  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం కేజ్రీవాల్
  • రేపు సాయంత్రం 4.30 గంటలకు సమయం ఇచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
  • రాజీనామా లేఖను సమర్పించనున్న ఆప్ అధినేత!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిర్దోషినని నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో కొనసాగబోనని, రెండు రోజుల్లో పదవికి రాజీనామా చేస్తానంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన రాజీనామాకు ముహూర్తం కూడా ఖరారైంది. 

కేజ్రీవాల్ ఈ రోజు (సోమవారం) లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అపాయింట్‌మెంట్‌ కోరారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు సమయం ఇస్తున్నట్టు వీకే సక్సెనా కార్యాలయం సమాచారం ఇచ్చింది. దీంతో రేపు లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేటీ సందర్భంగా కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఢిల్లీ సీఎం పదవీకాలం ముగియడానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ప్రజాదరణ, పార్టీలో మంచి పేరున్న వ్యక్తిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని ఆప్ నాయకత్వం యోచిస్తోంది. సీఎం రేసులో ప్రముఖంగా ఐదుగురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ... కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా జైలులో ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని చక్కబెట్టిన మహిళా మంత్రి అతిషి పేరు సీఎం రేసులో ఎక్కువగా వినిపిస్తోంది.

కాగా, ఆదివారం మధ్యాహ్నం ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తనను జైలుకు పంపి, ఆప్‌లో చీలికలు తీసుకురావాలని ప్రయత్నించారని, తద్వారా ఢిల్లీ పీఠం చేజిక్కించుకోవాలని భావించారని బీజేపీని ఉద్దేశించి ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా ఆప్‌ను విచ్ఛిన్నం చేయలేకపోయారని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే ఇన్నాళ్లు రాజీనామా చేయలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News