Cat: ప్రపంచంలో అత్యంత వృద్ధ పిల్లి మృతి... వయసు ఎంతో తెలుసా?

the worlds oldest cat Rosie has dead

  • 33 ఏళ్ల వయసులో చనిపోయిన రోసీ
  • 1991లో జననం.. ఇటీవలే మరణం
  • యూకేలోని యజమాని ఇంట్లో కన్నుమూత

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వయసున్న పిల్లిగా భావిస్తున్న ‘రోసీ’ చనిపోయింది. యూకేలోని నార్విచ్‌లో 33 ఏళ్ల వయసులో అది కన్నుమూసిందని యజమానురాలు లీలా బ్రిస్సెట్ తెలిపారు. ఇటీవలే రోసీ చనిపోయిందని, ఈ ఏడాది జూన్ నెలలో 33వ ఏడాదిలోకి అడుగుపెట్టిందని ఆమె వెల్లడించారు. రోసీ 1991లో జన్మించిందని చెప్పారు.

చిన్న పిల్లగా ఉన్నప్పుడు రోసీని దత్తత తీసుకున్నామని లీలా తెలిపారు. ‘‘రోసీని నేను చాలా మిస్ అవుతున్నాను. కొంతకాలంగా దాని ఆరోగ్యం బాగోలేదు. ఒక రోజు హాలులోకి నడిచి వెళ్లి కూలబడింది. అక్కడే అది చనిపోయింది. రోసీతో చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. దానితో ఇన్నేళ్లు గడిపినందుకు నాకు సంతోషంగా ఉంది’’ అని లీలా చెప్పారు. 

రోసీ కొన్నేళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదని, ఒక కిటికీ దగ్గర పడుకుంటోందని చెప్పారు. నిజానికి రోసీని ఓ ఫ్యామిలీ తీసుకెళ్లాల్సి ఉందని, కానీ వారి పాపకు ఎలర్జీ ఉండడంతో తీసుకెళ్లలేదని లీలా వెల్లడించారు. 

కిటికీ దగ్గర రోజంతా నిద్రపోయేదని, ఒక ట్రేలో కొంచెం ఆహారం తినడం మళ్లీ పడుకోవడం ఇలా చేసేదని చెప్పారు. బతికి ఉందో లేదో అని పలు సార్లు చెక్ చేయాల్సి వచ్చిందని, శ్వాస తీసుకుంటుందో లేదో తరచుగా చెక్ చేసేదానినని పేర్కొన్నారు. కాగా రోసీ గతంలో ఒక వీధికుక్కను, ఒక పిల్లిని రక్షించిందని ‘న్యూయార్క్ పోస్ట్’ కథనం పేర్కొంది. 

కాగా ప్రస్తుతం ‘ప్రపంచంలో అతి పెద్ద వయసున్న పిల్లి రోసీ’ అనే ట్యాగ్ అనధికారికంగా కొనసాగుతోంది. అధికారికంగా చూస్తే ఫ్లోసీ అనే 28 ఏళ్ల పిల్లి అతిపెద్ద వయసు పిల్లిగా గుర్తింపు పొందింది. 

ఇక అమెరికాలోని టెక్సస్‌లో క్రీమ్ పఫ్ అనే పిల్లి ఏకంగా 38 సంవత్సరాలు బతికింది. ఆగష్టు 3, 1967న జన్మించిన ఇది ఆగష్టు 6, 2005న చనిపోయింది. కాగా ఒక పిల్లి 33 సంవత్సరాలు బతకడమంటే ఒక మనిషి 152 ఏళ్లు జీవించడంతో సమానం.

  • Loading...

More Telugu News