Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా?

Expensive Bats Used By Cricketers

  • ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్... వివియ‌న్ రిచ‌ర్డ్స్
  • ఈ మాజీ క్రికెట్‌ దిగ్గజం వాడిన‌ ది గ్రే నికోల్స్ లెజెండ్ గోల్డ్ బ్రాండ్ బ్యాట్ ధ‌ర రూ.11.74 లక్షలు
  • ఆసీస్‌ స్టార్ బ్యాట‌ర్‌ స్టీవ్ స్మిత్ వాడే ఎన్‌బీ అనే బ్యాట్ ధర అక్ష‌రాలా రూ.11 లక్షలు 
  • హార్దిక్ పాండ్య ఉప‌యోగించే ఎస్‌జీ బ్యాట్ ధర రూ.1.79 ల‌క్ష‌లు    

ఇంత‌కుముందు కొన్ని దేశాల‌కే ప‌రిమిత‌మైన క్రికెట్ ఆట‌... ఇప్పుడిప్పుడే ప్ర‌పంచ‌వ్యాపితం అవుతోంది. దేశదేశాల్లో క్రికెట్ క్రేజ్ పెరుగుతోంది. మొన్నటి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో అగ్ర‌రాజ్యం అమెరికాలో కూడా క్రికెట్ ఫీవ‌ర్ కొన‌సాగింది. అక్క‌డ ఇప్ప‌టికే ప‌లు టీ20 టోర్నీలు జ‌రుగుతున్నాయి. 

ఇక సినిమా స్టార్ల‌ మాదిరిగానే క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయాన్నైనా తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో అత్యంత ఖరీదైన బ్యాట్లను వాడిన క్రికెటర్లు ఎవరు? ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్ ఎవరు? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్ మ‌రెవ‌రో కాదు. వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ ది గ్రేట్ వివియ‌న్ రిచ‌ర్డ్స్. ఈ మాజీ క్రికెట్‌ దిగ్గజం ది గ్రే నికోల్స్ లెజెండ్ గోల్డ్ బ్రాండ్ బ్యాట్ వాడాడు. ఇంగ్లీష్ విల్లో కలపతో తయారుచేసే ఈ బ్యాట్ ధర 14 వేల డాలర్లు. అంటే మ‌న‌ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.11.74 లక్షలు. ఇదే ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న రికార్డు స్థాయి బ్యాట్ ధ‌ర‌. 

ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్‌ స్టీవ్ స్మిత్ కూడా ఖరీదైన బ్యాట్‌నే ఉప‌యోగిస్తున్నాడు. స్మిత్ వాడుతున్న ఎన్‌బీ (న్యూ బ్యాలెన్స్) అనే బ్యాట్ ధర అక్ష‌రాల‌ రూ.11 లక్షలు. స్మిత్ త‌ర్వాత ఖ‌రీదైన బ్యాట్ వాడేది భార‌త ఆట‌గాడు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యనే. ఈ హార్డ్ హిట్టర్ వాడే ఎస్‌జీ బ్యాట్ ధర రూ.1.79 ల‌క్ష‌లు. ఇక వెంస్టిడీస్ మ‌రో దిగ్గ‌జ ఆట‌గాడు క్రిస్ గేల్ సైతం ఖ‌రీదైన బ్యాటే వాడ‌తాడు. ఈ  సిక్సర్ల వీరుడు వాడే స్పార్టన్ బ్రాండ్ బ్యాట్ ధర రూ. 1లక్ష.

అలాగే ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ కూడా ఖరీదైన బ్యాట్‌ ఉపయోగిస్తున్నాడు. అతడు వాడే కుకబురా బ్యాట్ ధర అక్షరాలా రూ.97 వేలు. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ వాడే డీఎస్‌సీ (డీల‌క్స్ స్పోర్ట్స్ కంపెనీ) బ్యాట్ ధర రూ.95 వేలు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జీఎం బ్యాట్ ఉప‌యోగిస్తుంటాడు. ఈ బ్యాట్ ధ‌ర రూ. 95వేలుగా ఉంటుంది. 

ఇక మ‌న భార‌త స్టార్లు సూర్య కుమార్ యాద‌వ్‌, విరాట్ కోహ్లీ ఉప‌యోగించే బ్యాట్ల ధ‌ర‌ల విష‌యానికి వ‌స్తే.. సూర్య వాడే ఎస్ఎస్ బ్యాట్ ధర రూ.92 వేలు అయితే, కింగ్ కోహ్లీ వాడుతున్న ఎంఆర్ఎఫ్ బ్యాట్ ధ‌ర రూ. 77వేలు.

  • Loading...

More Telugu News