Vivek Ramaswamy: ట్రంప్‌కు సమీపంలో కాల్పుల ఘటనపై స్పందించిన వివేక్ రామస్వామి

Vivek Ramaswamy responds on firing near Donald Trump

  • ట్రంప్ మరోసారి సురక్షితంగా బయటపడ్డారన్న ఇండియన్ అమెరికన్ రాజకీయ నేత
  • అమెరికాలో పెరుగుతున్న రాజకీయ హింసను ఆపాల్సి ఉందన్న వివేక్ రామస్వామి
  • జోబైడెన్‌కు ఇచ్చే భద్రతను ట్రంప్‌కు ఇవ్వాలని డిమాండ్

డొనాల్డ్ ట్రంప్‌కు సమీపంలో కాల్పులు జరిగిన ఘటనపై భారత మూలాలు కలిగిన అమెరికా రాజకీయ నాయకుడు వివేక్ రామస్వామి స్పందించారు. పెరుగుతున్న రాజకీయ హింస, ట్రంప్ భద్రతపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ట్రంప్ మరోసారి సురక్షితంగా బయటపడ్డారని, కానీ పెరుగుతున్న రాజకీయ హింసను ఆపాల్సి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ హింసను వెంటనే ఆపివేయాలన్నారు. హింస ఆమోదయోగ్యం కాదని, అలాగే అమెరికన్ వ్యక్తిత్వానికి వ్యతిరేకమని వెల్లడించారు. ట్రంప్ ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున జోబైడెన్‌కు ఇచ్చే భద్రతను కల్పించాలని సీక్రెట్ సర్వీసెస్‌ను డిమాండ్ చేశారు.

అమెరికాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ట్రంప్‌పై ఇలా జరగడం రెండోసారి అని, రెండుసార్లూ ప్రమాదం నుంచి తప్పించినందుకు వివేక్ రామస్వామి దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్‌పై ఎన్నికల సమయంలో జరిగిన రెండు హత్యాయత్నాలు అత్యంత దారుణమని పేర్కొన్నారు.

క్షేమంగా ఉన్నాను: ట్రంప్

తనకు సమీపంలోనే కాల్పులు జరిగాయని, తాను క్షేమంగానే ఉన్నానని డొనాల్డ్ ట్రంప్ అభిమానులను ఉద్దేశించి ఈ-మెయిల్ చేశారు. తనను ఏదీ అడ్డుకోలేదని... ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఎప్పటికీ లొంగేది లేదన్నారు.

డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసిందని, ఆయనపై హత్యాయత్నానికి ప్రయత్నించిన సిద్ధమైన అనుమానితుడు భద్రతా సిబ్బంది అదుపులో ఉన్నాడని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అమెరికాలో రాజకీయ హింసకు తావులేదన్నారు. ట్రంప్‌కు కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News