Ola: ఓలా స్కూటర్ కొనొద్దని యువతి ప్లకార్డు... స్పందించిన సంస్థ ప్రతినిధులు

woman hangs dont buy ola electric bike

  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఇబ్బందులు పడుతున్నానని యువతి పోస్ట్
  • తన స్కూటర్‌కు ప్లకార్డు ప్రదర్శించి అసంతృప్తి వ్యక్తం చేసిన బెంగళూరు యువతి
  • వాహనాన్ని మరమ్మతు చేయించేందుకు తీసుకెళ్లిన ఓలా కంపెనీ ప్రతినిధులు

కర్ణాటకలోని కలబురిగిలో ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ కస్టమర్ ఒకరు తీవ్ర అసహనంతో సర్వీస్ స్టేషన్‌కు నిప్పంటించాడు. తాజాగా బెంగళూరులోని మరో కస్టమర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బెంగళూరుకు చెందిన నిషా గౌరి తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీకి వ్యతిరేకంగా ప్లకార్డును ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనంతో తాను ఎదుర్కొంటున్న సమస్యలను అందులో ప్రస్తావించింది. తన స్కూటర్‌కు ప్లకార్డు ప్రదర్శించిన ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది.

"ప్రియమైన కన్నడ ప్రజలారా, ఓలా పనికిరాని బైక్. మీరు ఓలా బైక్ కొనుగోలు చేస్తే కనుక అది మీ జీవితాన్ని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. దయచేసి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయకండి" అని ప్లకార్డును ప్రదర్శించింది. దీనిని ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

తాను కొనుగోలు చేసిన ఓలా బైక్ ఇబ్బంది పెడుతోందని, తరుచూ బ్రేక్ డౌన్, సాఫ్ట్ వేర్ సమస్యలతో ఇబ్బంది కలుగుతోందని నిషా గౌరి తెలిపింది. ఈ స్కూటర్‌ను కొనడానికి ముందే డబ్బులు చెల్లించి... నెల రోజులు వేచి చూసి తీసుకున్నానని, అయినప్పటికీ వాహనంలో సమస్యలు వస్తున్నాయని తెలిపింది.

తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంస్థ ప్రతినిధులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కంపెనీ ప్రతినిధులు స్పందించారు. వాహనాన్ని మరమ్మతు చేయించేందుకు తీసుకువెళ్లారు. అంతేకాదు, తాత్కాలికంగా ఆమె నడుపుకోవడానికి వేరే స్కూటర్ ‌ను ఇచ్చారు.

Ola
Bengaluru
Karnataka
  • Loading...

More Telugu News