Jagan: రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం దేనికి నిదర్శనం చంద్రబాబు గారూ?: జగన్

Jagan take a dig at CM Chandrababu over MBBS seats

  • చంద్రబాబుపై జగన్ ఫైర్
  • కొత్త ఎంబీబీఎస్ సీట్లను వద్దంటూ చంద్రబాబు లేఖ రాశారన్న జగన్
  • ఆ లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ ఆరోపణలు

రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, వద్దంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం దారుణమని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. పొరుగు రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తుంటే... మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు గారూ? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. 

నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళితే ఈ సంవత్సరంలోనే పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, పాడేరు, ఆదోని మెడికల్ కాలేజీల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవని జగన్ వెల్లడించారు. కానీ, ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు కేటాయిస్తే, వద్దంటూ ప్రభుత్వం లేఖ రాయడం ఏంటి? వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసే కుంభకోణాలకు ఆలోచన చేయడం ఏంటి? అని నిలదీశారు. 

అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారని, సీట్ల సంగతి దేవుడెరుగు... ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారని జగన్ ఆరోపించారు. పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆసుపత్రులకు, సీహెచ్‌సీలకు, పీహెచ్‌సీలకు, విలేజ్‌ క్లినిక్స్‌కు మార్గదర్శిగా ఉంటుందని తెలిపారు. 

సూపర్‌ స్పెషాలిటీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఆ జిల్లాస్థాయిలో, అక్కడే లభిస్తాయని... అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలకు కూడా అని జగన్ స్పష్టం చేశారు.

చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలని, తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. 

"మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి... పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురండి... మీకు చేతనైనంత ఖర్చు చేస్తూ వెళ్లండి... మీకు చేతకాకపోతే మేం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా పూర్తి చేస్తాం. అంతేకానీ, ఇలా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మాటున కుంభకోణాలు చేయడం మానుకో చంద్రబాబూ! లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది" అని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News