Vijay Devarakonda: ఇక నుంచి నిన్ను "నానీ అన్నా" అని పిలుస్తా: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda handed SIIMA Award to Nani

  • సైమా వేడుకల్లో విజయ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న నాని
  • ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా రోజులను గుర్తు చేసుకున్న విజయ్ దేవరకొండ
  • నానీ ఎంతో సపోర్ట్ చేశాడని వెల్లడి 

సైమా అవార్డుల్లో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా నాని అవార్డు అందుకున్నారు. దసరా చిత్రానికి గాను నానీకి సైమా అవార్డు లభించింది. గతంలో నాని, విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నటించారు. 

సైమా వేదికపై విజయ్ దేవరకొండ... నానీకి అవార్డు అందించిన అనంతరం... ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో తాను అందరినీ అన్నా అని పిలుస్తుంటానని, ఎందుకు పిలుస్తానో తెలియదని వ్యాఖ్యానించారు. కానీ, నానీని మాత్రం తాను ఓ అన్నగా భావిస్తానని, అందుకే ఇక నుంచి "నానీ అన్నా" అని పిలుస్తానని వెల్లడించారు. 

నానీ వరుస హిట్లు కొట్టడం తనకు సంతోషాన్నిచ్చిందని, తన చేతుల మీదుగా అవార్డును అందించడం ఆనందం కలిగించిందని విజయ్ దేవరకొండ వివరించారు. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో తాను మొదటిసారిగా ఓ కీ రోల్ పోషించానని, తన మొదటి ఆడిషన్ నానీతోనే అని వెల్లడించారు. ఆ చిత్ర సమయంలో నానీ ఎంతో సపోర్ట్ చేశాడని విజయ్ గుర్తు చేసుకున్నారు. 

ఇక నానీ మాట్లాడుతూ, విజయ్ ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలని తపనపడే వ్యక్తి అని తెలిపారు. ప్రస్తుతం విజయ్... గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నాడని, ఆ సినిమాలో విజయ్ కి అవార్డు గ్యారంటీ అని అన్నారు. వచ్చే ఏడాది ఇదే వేదికపై విజయ్ కి తాను అవార్డును అందిస్తానని నానీ జోస్యం చెప్పారు.

More Telugu News