Rammohan Naidu: విజయవాడ నుండి నేరుగా సింగపూర్, దుబాయ్ కు విమాన సర్వీసులు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- అమరావతికి దేశంలోని ఏ నగరం నుండైనా తేలికగా రాకపోకలు సాగించేలా విమాన అనుసంధానం ఏర్పాట్లపై దృష్టి పెట్టామన్న మంత్రి రామ్మోహన్‌నాయుడు
- మూడు నెలల్లోనే గన్నవరం విమానాశ్రయానికి నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్లు వెల్లడించిన మంత్రి
- విమాన ప్రయాణీకులు పెరిగారని చెప్పిన మంత్రి రామ్మోహన్‌నాయుడు
విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుండి నేరుగా దుబాయ్, సింగపూర్ కు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు ముఖ ద్వారం వద్ద నుండి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ వేసిన అప్రోచ్ రోడ్డును ఆయన శనివారం ప్రారంభించారు. ఢిల్లీకి మరో కొత్త ఇండిగో సర్వీసును కూడా మంత్రి ప్రారంభించారు.
అనంతరం మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని అమరావతికి దేశంలోని ఏ నగరం నుండైనా తేలికగా రాకపోకలు సాగించేలా విమాన అనుసంధానం ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారని, ఈ మేరకు వరుసగా నూతన సర్వీసులను ఆరంభిస్తున్నట్లు చెప్పారు. ఈ మూడు నెలల్లోనే గన్నవరం నుండి నాలుగు కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందుతో పరిస్థితి పోలిస్తే ప్రస్తుతం ప్రయాణీకులు గణనీయంగా పెరిగారని చెప్పారు. గతంలో నెలకు సగటున 85వేల మంది రాకపోకలు సాగించగా, ప్రస్తుతం లక్షకు చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మైసూరు ఎంపీ యదువీర కృష్ణదత్త, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.