CM Revanth Reddy: ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం: సీఎం రేవంత్ రెడ్డి

CM revanth reddy who launched the book prophet for the world

  • రచయిత మౌలానా రెహమాన్ రాసిన ‘ప్రొఫెట్ ఫర్ ద వరల్డ్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం
  • మంచి ప్రభుత్వాన్ని నడపాలంటే మంచి ప్రతిపక్షం కూడా ఉండాలన్న రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రెండోసారి అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి

రచయిత మౌలానా రెహమాన్ రాసిన 'ప్రొఫెట్ ఫర్ ద వరల్డ్' పుస్తకాన్ని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని అరాంఘర్‌లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది అందరూ చదవాల్సిన పుస్తకమని అన్నారు. ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు లభించిందని అన్నారు. గీత, బైబిల్, ఖురాన్ సారాంశం ప్రపంచ శాంతి మాత్రమేనని పేర్కొన్నారు. కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయన్నారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మన ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. 

గతంలో హైదరాబాద్‌లో ఒక వైపు ఒవైసీ, మరో వైపు నేను ఎంపీగా ఉన్నామన్నారు. అసదుద్దీన్ ఒవైసీ కొన్ని సార్లు కాంగ్రెస్‌పై కూడా విమర్శలు చేసేవారని తెలిపారు. మంచి ప్రభుత్వాన్ని నడపాలంటే మంచి ప్రతిపక్షం కూడా ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ లో పేదల తరపున మాట్లాడే నేతలు తగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో పేదల కోసం మాట్లాడే వారిలో అసదుద్దీన్ ఒవైసీ ఒకరని అన్నారు. ఎన్నికలు ముగిసే వరకే రాజకీయాలని, ఆ తరువాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం అంతా కలిసి పనిచేయాలన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నామని తెలిపారు.

అనేక ఏళ్ల నుంచి మూసీ నది మురికి కూపంలా మారిందని, మూసీ ప్రక్షాళన కోసం మజ్లిస్ సహకారం తీసుకుంటున్నామని సీఎం రేవంత్ చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇవ్వనున్నామని తెలిపారు. దేశాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిదని అన్నారు. ఒక మంచి మార్గంలో మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కలిసిమెలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోదామన్నారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు ప్రభుత్వాలను రెండు సార్లు గెలిపించారని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రెండోసారి అవకాశం వస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ పదేళ్ల పాటు పేదల సంక్షేమం కోసం పనిచేస్తామని సీఎం రేవంత్ అన్నారు.

More Telugu News