ind vs ban: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా ఎత్తుగడ ఇదే!
- టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించి మంచి జోష్ మీద ఉన్న బంగ్లా టీమ్
- సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్-భారత్ మధ్య చెన్నైలో తొలి టెస్ట్
- బంగ్లా బ్యాటర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఎర్రమట్టితో తయారు చేసిన పిచ్ వినియోగంపై కసరత్తు
- బంగ్లా యువ పేసర్ నహిద్ రాణాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పంజాబ్ పేసర్ గర్నూర్ బ్రార్‌ను రంగంలోకి దింపిన భారత్
ఇటీవల టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించి మంచి జోష్ మీద ఉన్న బంగ్లాదేశ్ టీమ్‌ను టీమిండియా అంత తేలికగా తీసుకోవడం లేదు. ఈ నెల (సెప్టెంబర్) 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్ తో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ బ్యాటర్ల ఊపునకు అడ్డుకట్ట వేసేందుకు టీమిండియా పలు ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం.
ప్రధానంగా ఈ మ్యాచ్ కు ఎర్రమట్టితో తయారు చేసిన పిచ్ ను వినియోగించాలని టీమిండియా భావిస్తున్నట్లు తెలుస్తొంది. సాధారణంగా ఈ స్టేడియంలో నల్ల మట్టితో తయారు చేసిన పిచ్ ను ఉపయోగిస్తుంటారు. మందకొడిగా ఉండే నల్ల మట్టి పిచ్‌లు స్పిన్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. అయితే, ఇటీవల కాలంలో బంగ్లా బ్యాటర్లు స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా బంగ్లా టీమ్‌కు నాణ్యమైన స్పిన్ బౌలింగ్ దళం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎర్రమట్టి పిచ్‌ను వినియోగించి బంగ్లాకు అడ్డుకట్ట వేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పేస్ బౌలింగ్ తో బంగ్లా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాలన్న వ్యూహంలో భాగంగా పలు చర్యలు చేపడుతోంది. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ వంటి బౌలర్లతో టీమిండియా పేస్ విభాగం పటిష్టంగా ఉంది. భారత్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ పేస్ దళం బలహీనంగా ఉంది. అంతే కాకుండా పాకిస్థాన్‌పై బంగ్లా టెస్ట్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువ పేసర్ నహిద్ రాణాను (6 అడుగుల 5 అంగులాల ఎత్తు) సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ .. పంజాబ్ పేసర్ గర్నూర్ బ్రార్‌ను (6.6 ఫీట్స్) రంగంలోకి దించింది.