Neeraj Chopra: ఒక్క సెంటీమీటర్ వెనుకంజ.. డైమండ్ లీగ్ ఫైనల్లో రెండో స్థానంలో నీరజ్ చోప్రా

Neeraj Chopra Finishes 2nd Diamond League Final 2024


పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకంతో సరిపెట్టుకున్న భారత జావెలిన్ త్రో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ‘డైమండ్ లీగ్ 2024 ఫైనల్లోనూ రెండవ స్థానంలోనే నిలిచాడు. కేవలం ఒక్క సెంటీమీటర్  మాత్రమే వెనుకబడ్డాడు. బ్రస్సెల్స్‌ వేదికగా శనివారం డైమండ్ లీగ్ 2024 జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ జరిగింది. కరేబియన్ దేశం గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల త్రో విసిరి తొలి స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించిన అతడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇక నీరజ్ చోప్రా 87.86 మీటర్ల అద్భుత త్రో విసిరినప్పటికీ కేవలం 0.01 మీటర్ల వెనుకంజతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కాగా పారిస్ ఒలింపిక్స్ 2024, ఇటీవల జరిగిన లాసాన్ డైమండ్ లీగ్‌లో కూడా నీరజ్ చోప్రా రెండవ స్థానంలోనే నిలిచాడు. దీంతో డైమండ్ లీగ్‌ను సొంతం చేసుకోవాలని ఎన్నో ఆశలతో అడుగుపెట్టాడు. అయినప్పటికీ నిరాశ తప్పలేదు. అండర్సన్ పీటర్స్ మొదటి ప్రయత్నంలో 87.87 మీటర్ల దూరం విసిరాడు.

26 ఏళ్ల నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో 86.82 మీటర్లు విసరగా.. మూడవ రౌండ్‌లో అత్యుత్తమ త్రో 87.86 మీటర్లు విసిరి టైటిల్ రేసులో నిలిచాడు. జర్మనీ అథ్లెట్ జూలియన్ వెబర్  85.97 మీటర్ల త్రోతో మూడవ స్థానంలో నిలిచాడు.

డైమండ్ లీగ్ 2024 -పురుషుల జావెలిన్ త్రో..

1. అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) - 87.87 మీటర్లు ( తొలి ప్రయత్నం)
2. నీరజ్ చోప్రా (ఇండియా) - 87.86 మీటర్లు ( మూడవ ప్రయత్నం)
3. జూలియన్ వెబర్ (జర్మనీ) - 85.97 మీటర్లు ( తొలి ప్రయత్నం)
4, ఆండ్రియన్ మర్దారే (మోల్డోవా) - 82.79 మీటర్లు (తొలి ప్రయత్నం)
5. జెంకీ డీన్ రోడ్రిక్ (జపాన్) - 80.37 మీటర్లు (నాలుగవ ప్రయత్నం)

  • Loading...

More Telugu News