Budameru: బుడమేరుకు మళ్లీ వరదలు వస్తున్నాయంటూ పుకార్లు... వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్ సృజన
- ఇటీవల బుడమేరుకు గండ్లు
- విజయవాడను ముంచెత్తిన వరద నీరు
- బుడమేరు కట్ట మళ్లీ తెగిందంటూ ప్రచారం
- వదంతులు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్
ఇటీవల బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ యంత్రాంగం అంతా పది రోజులు తీవ్రంగా శ్రమించాక, విజయవాడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే, బుడమేరుకు మళ్లీ గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తోందని పుకార్లు బయల్దేరాయి. దీనిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పందించారు. బుడమేరుకు గండ్లు పడ్డాయన్న వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. బుడమేరుకు ఎలాంటి వరద నీరు రాలేదని తెలిపారు.
బుడమేరుకు మళ్లీ వరద అంటూ కొందరు ఆకతాయిలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని కలెక్టర్ సృజన వివరించారు. పుకార్లు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అవి వదంతులు మాత్రమే: మంత్రి నారాయణ
బుడమేరుకు మళ్లీ వరద వస్తోందని, విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, తదితర ప్రాంతాలు మళ్లీ నీట మునుగుతాయని జరుగుతోన్న ప్రచారంపై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించారు. మళ్లీ బుడమేరుకు వరద వస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని అన్నారు.
కొత్త రాజేశ్వరిపేట, జక్కంపూడి కాలనీల్లో ఎలాంటి వరద నీరు రాలేదని వెల్లడించారు. బుడమేరు కట్ట మళ్లీ తెగిందనేది పూర్తిగా అవాస్తమని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరంలేదని మంత్రి నారాయణ పేర్కొన్నారు.