Vizag Steel Plant: అలాంటి పరిస్థితే వస్తే పదవులకు రాజీనామా చేస్తాం: పల్లా శ్రీనివాసరావు
- విశాఖ స్టీల్ ప్లాంట్ లో ముడిసరుకు కొరత!
- ఒక ఫర్నెస్ ను మూసివేశారంటూ కథనాలు
- నేడు మరో ఫర్నెస్ నిలిపివేస్తున్నారంటూ వార్తలు
- ఆందోళనకు దిగిన కార్మికులు
- కార్మికులకు మద్దతు పలికిన టీడీపీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మూసివేత ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే పదవులకు రాజీనామా చేస్తామని అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చెందవద్దని పల్లా సూచించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమలో ముడిసరుకు కొరత ఏర్పడిందంటూ యాజమాన్యం నిన్న ఒక ఫర్నెస్ ను నిలిపివేసినట్టు కథనాలు వచ్చాయి. ఇవాళ మరో ఫర్నెస్ ను కూడా నిలిపివేస్తుందన్న వార్తల నేపథ్యంలో, కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల ఆందోళనకు టీడీపీ ఎంపీ భరత్, పల్లా శ్రీనివాసరావు మద్దతు పలికారు. ఈ సందర్భంగానే పల్లా పైవిధంగా వ్యాఖ్యానించారు.
కాగా, స్టీల్ ప్లాంట్ నష్టాలకు యాజమాన్యం చర్యలే కారణమని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. ఒప్పంద కార్మికులకు గత నాలుగు నెలలుగా జీతాలు లేవని తెలిపారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సహ సమన్వయకర్త జె.అయోధ్యరామ్ స్పందిస్తూ... 3 వేల మంది ఒప్పంద కార్మికులను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయాలని 2 వేల మంది కార్మికులపై ఒత్తిడి తెస్తున్నారని, మరో 500 మందిని ఇతర పరిశ్రమలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.