Hero Govinda: బాలీవుడ్ స్టార్ గోవిందా ఇంట్లో పనిమనిషిగా మంత్రి కుమార్తె... ఆసక్తికర విషయం పంచుకున్న నటుడి భార్య

A ministers daughter entered Hero Govinda house as a servant to see him

  • ఆయనను చూసేందుకు పనిమనిషిగా ఇంట్లో చేరిన వీరాభిమాని
  • ఆ అమ్మాయి ఓ మంత్రి కుమార్తె అని తెలిసిందని వెల్లడి
  • పెళ్లైన కొత్తలో ఈ విషయం జరిగిందని వెల్లడించిన గోవిందా భార్య సునీత అహూజ
  • అభిమానుల ఫాలోయింగ్ చూసి ఆనందించేదానినని వెల్లడి

సినిమా తారలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. స్టార్ హీరోలు, హీరోయిన్లకైతే అభిమానులు కోకొల్లలుగా ఉంటారు. అందులో కొందరు వీరాభిమానులు ఉంటారు. తమ ఇష్ట నటుడిని ప్రత్యక్షంగా చూడాలని, కలిసి మాట్లాడాలని పరితపిస్తుంటారు. ఇక హీరోలకు లేడీ ఫ్యాన్స్ మరింత ప్రత్యేకమని చెప్పాలి. అభిమాన హీరోని కలవాలని తెగ ఆరాటపడుతుంటారు. ఇలాంటి ఓ లేడీ అభిమాని బాలీవుడ్ అగ్ర నటుడు గోవిందాను చూసేందుకు ఎంత పని చేసిందో ఆయన భార్య సునీత అహూజ వెల్లడించారు.

వివాహం అయిన కొత్తలో తమ ఇంటికి ఒక యువతి వచ్చిందని, పనిమనిషిగా చేరిన ఆమెకు గిన్నెలు తోమడం రాదని సునీత చెప్పారు. కనీసం ఇల్లు కూడా శుభ్రం చేయడం రాదని, గోవిందాను చూసేందుకు ఆమె నిద్ర మానుకొని వేచిచూసేదని చెప్పారు. దాదాపు 20 రోజులు ఆమె తమతోనే ఉందని, అయితే ఆమె రూపు, ప్రవర్తన తీరు గమనిస్తే సంపన్నుల అమ్మాయిలా కనిపించిందని, చివరికి ఆమె ఒక మంత్రి కూతురు అని తెలిసిందని సునీత వెల్లడించారు. 

ఎందుకిలా చేశావని ప్రశ్నించగా ఆమె కన్నీళ్లు పెట్టుకుందని, గోవిందాకు తాను వీరాభిమానినని చెప్పినట్టు ఆమె గుర్తుచేసుకున్నారు. యువతి ఇంట్లో వాళ్లకు సమాచారం ఇవ్వడంతో ఆమె తండ్రి 4 ఖరీదైన కార్లను పంపించారని, తామంతా ఆశ్చర్యపోయామని సునీత వివరించారు.

కెరీర్‌ పరంగా గోవిందా ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. ఆయనకు చాలామంది అభిమానులు ఉండేవారని, ఆయనను కలిసేందుకు ఫ్యాన్స్ విచిత్రమైన పనులు చేసేవారని అన్నారు. ఆయన ఫాలోయింగ్‌‌ను చూసి తాను సంతోషించేదాన్నని ఆమె చెప్పారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆమె ఈ విషయాలను తెలిపారు.

కాగా బాలీవుడ్ దిగ్గజ నటుల్లో గోవిందా ఒకరు. హీరోగా, సహాయ నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రల్లో అలరించిన ఆయన తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. డ్యాన్స్‌‌‌తో కూడా ఫ్యాన్స్‌ను ఆయన మెప్పించారు. అయితే గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్నారు.

More Telugu News