Kerala: అమ్మకానికి చూడచక్కని ఇల్లు... ధరపై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ

A post on X about a 4 BHK property in Kerala has stirred a discussion Social Media


సొంతింటి కల ఉండనివారు దాదాపు ఉండరు. కరోనా మహమ్మారి కష్టకాలం తర్వాత ఈ కోరిక మరింత మందిలో పెరిగిందనే చెప్పాలి. ఈ ప్రభావంతో ఇళ్లు, ఇళ్ల స్థలాల రేట్లు అమాంతం పెరిగాయి. ముఖ్యంగా దేశంలోని మెట్రో నగరాల్లో ఫ్లాట్ కొనాలంటే జడుసుకునేలా రేట్లు పెరిగిపోయాయి. ఢిల్లీ, నోయిడా, బెంగళూరు వంటి నగరాల్లో 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ సగటు ధర రూ.2 కోట్లుగా ఉంది. 

ఇక, 4 బీహెచ్‌కే రేటు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతోంది. ఎక్కువ కాలం పాటు ఈఎంఐ చెల్లింపులు చేయాల్సి రావడం, 8 శాతానికి పైగా ఉన్న బ్యాంకు వడ్డీలను చూసి ఇల్లు కొనాలనే కలను చాలా మంది పునఃపరిశీలన చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, కేరళలో ఒక ఇల్లు విక్రయం, దాని రేటుపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

కేరళలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న 4 బీహెచ్‌కే ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను ఇటీవల ఓ ఎంట్రప్రెన్యూర్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశాడు. ఓఎల్‌ఎక్స్ లిస్టింగ్‌లో ఉన్న ఈ ఇంటి విస్తీర్ణం 3500 చదరపు అడుగులుగా, రేటు రూ.3 కోట్లుగా ఉంది. ఈ ప్రాపర్టీలో 4 బెడ్‌రూమ్‌లు, 4 బాత్‌రూమ్‌లు, 2 పార్కింగ్ స్థలాలు, టెర్రస్, బాల్కనీ, చక్కటి సౌకర్యాలు ఉన్నాయని లిస్టింగ్‌లో పేర్కొన్నారు. దీంతో ఇంటి పరిమాణం, సౌకర్యాలు, ధరలపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.

ఇంటి ధరను కొందరు నెటిజన్లు సమర్థించారు. కేరళలో ఆస్తులు డబ్బుకు తగ్గట్టే ఉంటాయని కొందరు వ్యాఖ్యానించారు. వర్క్ ఫ్రమ్ హోం చేసే ఐటీ నిపుణులకు బాగుంటాయని పలువురు పేర్కొన్నారు. అయితే ధర చాలా ఎక్కువగా ఉందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. 

చాలా ఖరీదు చెబుతున్నారని, తక్కువ ధరలో చాలా మెరుగైన ఇళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అధిక ధరలు చెప్పే ఇలాంటి ఇళ్లు పైన పటారం.. లోన లొటారం మాదిరిగా ఉంటాయని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

కాగా, దేశంలో మారుతున్న రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితులను ఈ ఇంటి రేటు నొక్కి చెబుతోంది.

More Telugu News