Onion: రాయితీపై విక్రయించడంతో ఉల్లి ధరలు దిగొచ్చాయి: కేంద్రం
- ఉల్లిని సబ్సిడీపై రూ.35కు విక్రయిస్తున్న కేంద్రం
- దీంతో నగరాల్లో తగ్గిన ఉల్లి ధరలు
- ఉల్లి ధరలు అందుబాటులో ఉన్నాయన్న కేంద్రం
ఉల్లిని రాయితీపై విక్రయించడం వల్ల ప్రధాన నగరాలలో ధరలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 5 నుంచి కేంద్రం పలు నగరాల్లో ఉల్లిని కిలో రూ.35కి సబ్సిడీపై విక్రయిస్తోంది. దీంతో సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఢిల్లీలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.55కి, ముంబైలో రూ.61 నుంచి రూ.56కు, చెన్నైలో రూ.65 నుంచి రూ.58కి దిగొచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సీసీఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ఆధ్వర్యంలో ఔట్‌లెట్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా రిటైల్ వినియోగదారులకు ఢిల్లీ, ముంబైలలో సబ్సిడీ ఉల్లిని విక్రయించారు. చెన్నై, కోల్‌కతా, పాట్నా, రాంచీ, భువనేశ్వర్, గౌహతిలలోనూ ఔట్‌లెట్లు ప్రారంభించారు.
ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, కేంద్రీయ భండార్, సఫాల్ ఔట్‌లెట్లలో విక్రయిస్తుండటంతో ఉల్లి ధరలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.
ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జులై నాటికి భారత్ 2.6 లక్షల టన్నుల ఉల్లిని ఎగుమతి చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 16.07 లక్షల టన్నుల ఉల్లిని ఎగుమతి చేసింది.