Janhvi Kapoor: అత‌ని స‌ల‌హా వ‌ల్లే... నాకు టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్‌... జాన్వీక‌పూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

Janhvi Kapoor Interesting Comments on Tollywood Offers

  • 'దేవ‌ర'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి త‌న‌య
  • ఈ సినిమా విడుద‌ల కాకుండానే రామ్‌చ‌ర‌ణ్ సర‌స‌న హీరోయిన్‌గా ఆఫ‌ర్‌
  • ఇలా తెలుగులో త‌న‌కు వ‌రుస ఆఫ‌ర్లు రావ‌డం వెనుక‌ క‌ర‌ణ్‌జోహార్ స‌లహా ఉంద‌న్న బ్యూటీ

దివంగ‌త సీనియ‌ర్ న‌టి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ దేవ‌రతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. అటు బాలీవుడ్‌లో ధ‌డ‌క్ మూవీతో సినీ అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ... ఆ త‌ర్వాత వ‌రుస చిత్రాల‌తో అక్క‌డ తానేంటో నిరూపించుకుంది. ఇటు తెలుగులో మొద‌టి సినిమా విడుద‌ల కాకుండానే టాలీవుడ్ మ‌రో బ‌డా హీరో రామ్‌చ‌ర‌ణ్ సర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టేసింది.   

ఈ నెల 27న దేవ‌ర థియేట‌ర్లలోకి వ‌స్తోంది. దాంతో ఆమె ప్ర‌స్తుతం మూవీ ప్రచార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న‌కు టాలీవుడ్‌లో వ‌స్తున్న బంప‌రాఫ‌ర్స్ వెనుక ఓ వ్య‌క్తి స‌ల‌హా బాగా ప‌ని చేసిందంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. 

జాన్వీ క‌పూర్ మాట్లాడుతూ.. "హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. అతి త‌క్కువ స‌మ‌యంలోనే నేను మంచి పాత్ర‌ల్లో న‌టించి మెప్పించాను. అయితే, నేను తెలుగు చిత్ర‌సీమ‌లో రాణించాల‌నేది మా అమ్మ‌గారి కోరిక‌. అది నెర‌వేర్చాల‌ని ద‌క్షిణాదిలో సినిమాలు చేయాల‌నుకుంటున్న స‌మ‌యంలోనే నాకు తెలుగులో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అందులో దేవ‌ర ఒక‌టి. అప్పుడే కోలీవుడ్‌లో కూడా ఓ మూవీ ఛాన్స్ వ‌చ్చింది. 

ఇలా రెండు ఒకేసారి రావ‌డంతో కొంచెం క‌న్ఫ్యూజన్‌లో ప‌డిపోయాను. ఆ స‌మ‌యంలో నిర్మాత‌, ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్‌జోహార్ నాకు ఓ మంచి స‌ల‌హా ఇచ్చాడు. ముందు ఎన్‌టీఆర్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వు. ఆ త‌ర్వాత వాటంత‌ట అవే మంచి ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని సూచించాడు. ఆయ‌న చెప్పిన‌ట్లే మొద‌ట దేవ‌ర ఒప్పుకున్నాను. ఆ స‌ల‌హా నా కెరీర్‌కు బాగా క‌లిసొచ్చింది. 

దేవ‌ర రిలీజ్ కాకుండానే గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఇంకా కొన్ని ప్రాజెక్టులు డిస్క‌ష‌న్ స్టేజీలో ఉన్నాయి. తెలుగు చిత్ర‌సీమ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఆనందంగా ఉంది" అని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ చెప్పుకొచ్చింది.

More Telugu News