Boats: ఇంకా ఓ కొలిక్కిరాని బోట్ల తొలగింపు ప్రక్రియ

Boats removal yet to complete

  • ప్రకాశం బ్యారేజి వద్ద గేట్లను ఢీకొని చిక్కుకుపోయిన బోట్లు
  • ఒక్కో బోటు బరువు 40 టన్నులు
  • బోట్లను ఒకదానికొకటి కలిపి కట్టేసిన వైనం
  • అధికారులకు సవాల్ గా మారిన తొలగింపు ప్రక్రియ

ప్రకాశం బ్యారేజి వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియలో ఏమంత పురోగతి కనిపించలేదు. బరువైన లోహంతో తయారు చేసిన ఆ భారీ బోట్లను తొలగించడం అధికారులకు సవాల్ గా మారింది. 

ప్రకాశం బ్యారేజి గేట్ల వద్ద చిక్కుకుపోయిన బోట్లను వెలుపలికి తీసుకువచ్చేందుకు గత మూడ్రోజులుగా అధికారులు, డైవింగ్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడంలేదు. ఈ బోట్ల తొలగింపు చర్యల్లో కాకినాడ అబ్బులు బృందం కూడా పాలుపంచుకుంటోంది. 

ఒక్కో బోటు బరువు 40 టన్నులు కాగా... ఇతర బోట్లతో ఒకదానికొకటి కలిపి కట్టేయడంతో వాటిని కదిలించడం అత్యంత ప్రయాసగా మారింది. గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను మరో భారీ బోటుతో లాగేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

అయితే, గేటు నుంచి 10 అడుగులు కదిలాక ఒక బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుపోవడంతో తీవ్ర నిరాశ తప్పలేదు. బోల్తాపడిన బోటును క్రేన్లు, లిఫ్టులతో పైకి లేపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో, బోట్ల తొలగింపు చర్యలను అధికారులు ఇవాళ్టికి నిలిపివేశారు. రేపు బోటుకు బలమైన తాళ్లు, కొక్కేలు కట్టి బయటికి లాగాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News