Natarajan: భారత పేసర్ నటరాజన్ కీలక వ్యాఖ్యలు

I have stopped playing test cricket says Pacer Natarajan

  • తప్పక టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నట్టు వెల్లడి
  • వయసు రీత్యా టెస్ట్ క్రికెట్ ఆడితే భారం పడుతోందన్న నటరాజన్
  • మోకాలి సమస్యలు ఉన్నాయని చెప్పిన సన్‌రైజర్స్ బౌలర్

భారత పేస్ బౌలర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తప్పని పరిస్థితుల్లో టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నట్టు స్పష్టం చేశాడు. వయసు రీత్యా ఎక్కువ భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఆడడంలేదని చెప్పాడు. రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదని వ్యాఖ్యానించాడు. తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఇప్పటివరకు దేశవాళీ క్రికెట్‌లో ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదని వెల్లడించాడు.

కాగా నటరాజన్ వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు. 2020/21లో ఆసీస్ వేదికగా జరిగిన బోర్డర్-గవార్కర్ ట్రోఫీని చారిత్రాత్మక రీతిలో భారత్‌లో కైవసం చేసుకోగా నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో నటరాజన్ ఆడాడు. అతడికి అదే మొదటి, చివరి టెస్ట్ మ్యాచ్. త్వరలోనే ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 

ఒత్తిడి పెరగకూడదనే...

తాను టెస్ట్ క్రికెట్ ఆడి దాదాపు నాలుగు సంవత్సరాలు అయ్యిందని, రెడ్ బాల్ క్రికెట్ ఆడకూడదనే ఉద్దేశం ఏమీ లేదని, అయితే భారం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నానని, అందుకే దూరంగా ఉంటున్నట్టు వివరించాడు. 

‘‘ప్రస్తుతం నేను టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. నాకు మోకాలి సమస్యలు ఉన్నాయి. అందుకే ఆడటం మానేశాను. నాకు పరిమితి ఓవర్ల క్రికెట్ కంటే టెస్ట్ క్రికెట్ అంటేనే ఎక్కువ ఇష్టం. అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే కొన్నేళ్ల తర్వాత ఆడతాను. వచ్చే రెండేళ్లు బాగా శిక్షణ పొందితే తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి’’ అని వివరించాడు. 

ప్రస్తుతానికి పరిమిత ఓవర్ల క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెడుతున్నానని అన్నాడు. నటరాజన్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పరిమితి ఓవర్ల క్రికెట్‌లో పునరాగమనం చేస్తాడనే నమ్మకంతో ఉన్నట్టు అర్థమవుతోంది.

కాగా ఐపీఎల్-2024లో నటరాజన్ ఆకట్టుకున్నాడు. రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆకర్షణీయమైన ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌‌లు ఆడిన అతడు 9.05 ఎకానమీ రేటుతో మొత్తం 19 వికెట్లు తీశాడు. ఇక టీమిండియా తరపున నటరాజన్ 2 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌‌లు మాత్రమే ఆడాడు.

  • Loading...

More Telugu News