Harish Rao: డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులకు హరీశ్ రావు సూచన

Harish rao to DGP and Police officers

  • డీజీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న హరీశ్ రావు
  • గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళితే పోలీసులను తిట్టారని ఆరోపణ
  • తప్పు చేయాలని రేవంత్ రెడ్డి చెప్పినా చట్టబద్దంగా వ్యవహరించాలని హితవు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను గుడ్డిగా అనుసరించవద్దని డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులకు బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. కోకాపేట‌లోని త‌న నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... డీజీపీ అనేది అత్యున్నత స్థాయి, గౌరవప్రదమైన పోస్టు అని, ఈ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. రేవంత్ రెడ్డి గురించి తెలిసిందేనని... గతంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేయడానికి వెళితే పోలీసులను తిట్టారని ఆరోపించారు.

ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలను అనుసరించవద్దని కోరారు. తప్పు చేయాలని రేవంత్ చెప్పినా చట్టబద్ధంగా వ్యవహరించాలని హితవు పలికారు. నిన్న అరికెపూడి గాంధీని ఆపకుండా... ఈ రోజు తమను ఆపడం ఏమిటని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఇంటికి పంపించి దాడి చేయించినప్పుడు లా అండ్ ఆర్డర్ ఏమైందో చెప్పాలన్నారు.

రేవంత్ రెడ్డి విసిరే ప్రతి రాయి తమకు పునాదిరాయిగా మారుతుందన్నారు. రాళ్ల దాడులకు భయపడతామని అనుకుంటే పొరపాటు అన్నారు. పోరాటాలు తమకు కొత్తేమీ కాదన్నారు. తెలంగాణ గురించి బాధ్యతగా ఆలోచిస్తామన్నారు. 

పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి మరో సమస్యను సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయం కంటే రాష్ట్రం ముఖ్యమన్నారు.

More Telugu News