Kadabari Jethwani: నటి జత్వానీపై ఫిర్యాదుకు ముందే విమాన టికెట్లు బుకింగ్.. బయటపడిన పోలీసుల కుట్ర కోణం!
- నటి జత్వానీపై ఫిబ్రవరి 2న పోలీసులకు విద్యాసాగర్ ఫిర్యాదు
- ఫిబ్రవరి 1నే ముంబైకి టికెట్లు బుక్ చేసిన పోలీసులు
- ఫిర్యాదు అందిన వెంటనే ఆగమేఘాల మీద ముంబైకి
- ప్రభుత్వానికి చేరిన నివేదిక
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. జత్వానీని ఇరికించాలన్న ముందస్తు ప్రణాళికలో భాగంగా పోలీసులు ముందే విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి 2న ఉదయం 6.30 గంటలకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే రోజు 11.30 గంటలకు విమానంలో డీసీపీ విశాల్ గున్నీ, అదనపు డీసీపీ రమణమూర్తి తదితరులతో కూడిన బృందం ఆగమేఘాల మీద ముంబై వెళ్లింది.
ఈ విమాన టికెట్లను ఫిబ్రవరి 1న బుక్ చేశారు. అంటే.. నటి జత్వానీపై ముందుగానే కుట్ర జరిగినట్టు దీనిని బట్టి అర్థమవుతోంది. విద్యాసాగర్ ఫిర్యాదు చేయడానికి ముందే జత్వానీని అరెస్ట్ చేయాలని పక్కాగా కుట్ర జరిగినట్టు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా ఎవరైనా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసులో మాత్రం అందుకు విరుద్ధంగా నటి అరెస్ట్‌కు పక్కాగా రంగం సిద్దం చేసుకున్న అనంతరం ఫిర్యాదు చేయడం గమనార్హం. జత్వానీపై అక్రమ కేసు, అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు నివేదికను డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి అందించినట్టు తెలిసింది.