Chandrababu: మంచి ప్యాకేజి ఇస్తే తప్ప కోలుకోలేరు: కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు
- ఏపీలో ఇటీవల భారీ స్థాయిలో వరదలు
- నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం
- ఏపీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న సీఎం చంద్రబాబు
ఏపీలో వరద నష్టం పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. ఏపీలో వరద నష్టంపై అంచనా వివరాలను చంద్రబాబుతో పంచుకుంది.
ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ... రాష్ట్రంలో పంట నష్టంతో పాటు, భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందని, ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర బృందాన్ని కోరారు.
ఈ విపత్తును సాధారణ విపత్తులా చూడవద్దని విజ్ఞప్తి చేశారు. రికార్డు స్థాయిలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ప్రజా జీవితం అతలాకుతలం అయిందని వివరించారు. సర్వం కోల్పోయిన వరద బాధితులు, రైతులు మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప తిరిగి కోలుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
అందుకు కేంద్ర బృందం స్పందిస్తూ... తమ పరిశీలనకు వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తగు సాయం అందేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని కేంద్ర బృందం అధికారులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
కాగా, వరద నష్టం రూ.6,882 కోట్లు అని ఏపీ ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపడం తెలిసిందే. ఇక, కేంద్ర బృందం గత రెండ్రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వరద నష్టాన్ని పరిశీలించింది