Space: అంతరిక్షంలో ఒకేసారి 19 మంది... ఎవరు వారంతా?

new world record set with 19 humans in earth orbit at the same time

  • వేర్వేరు అంతరిక్ష ప్రయోగాలతో సరికొత్త రికార్డు
  • గతంలో వర్జిన్ గెలాక్టిక్, ఆక్సియం స్పేస్ ప్రయోగాల సమయంలో 17 మంది
  • మొట్టమొదటి ప్రైవేట్ వ్యక్తుల స్పేస్ వాక్ కూడా ఇదే తొలిసారి

భూమ్మీద వందల కోట్ల మంది ఉన్నా... వారిలో అంతరిక్షంలోకి వెళ్లింది అత్యంత స్వల్పం. అందులోనూ గరిష్ఠంగా ఐదారుగురు వెళ్లి రావడమేగానీ.. ఒకేసారి ఎక్కువ మంది అంతరిక్షంలో ఉన్నది చాలా అరుదు. అలాంటి అత్యంత అరుదైన ఘటన ఇవాళ నమోదైంది. ఈ రోజున ఒకే సమయంలో ఏకంగా 19 మంది అంతరిక్షంలో భూమిని చుట్టేస్తూ ఉండటం గమనార్హం. ఆ పూర్తి వివరాలివీ..

ఐఎస్ఎస్ లోనే 12 మంది..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో ఇప్పటికే ఏడుగురు పనిచేస్తున్నారు. ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తో కలసి 9 మంది అయ్యారు. బుధవారమే (సెప్టెంబర్ 11న) అంతరిక్ష కేంద్రానికి.. ఒక అమెరికా వ్యోమగామి, ఇద్దరు రష్యా వ్యోమగాములు వెళ్లారు. వీరితో కలిపి ఐఎస్ఎస్ లో ఉన్నవారి సంఖ్య 12కు చేరింది.

చైనా స్పేస్ స్టేషన్ లో ముగ్గురు
చైనాకు చెందిన టియాంగోంగ్ స్పేస్ స్టేషన్ లో ఆ దేశానికి చెందిన ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. వీరితో కలిపి 15 మంది అయ్యారు.

స్పేస్ ఎక్స్ ప్రైవేట్ మిషన్తో..
దేశాల అధికారిక ఆస్ట్రోనాట్లు కాకుండా.. స్పేస్ ఎక్స్ సంస్థ ప్రైవేటుగా తీసుకెళ్లిన నలుగురు పర్యాటకులు కూడా గురువారం నాడు స్పేస్ లో కలియదిరిగారు. స్పేస్ ఎక్స్ పోలారిస్ డాన్ మిషన్ లో అంతరిక్షంలోకి వెళ్లిన వారు.. స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలో ఎప్పుడూ ప్రైవేటు వ్యక్తులు స్పేస్ వాక్ చేయలేదు. ఇదే మొదటిసారి. ఈ నలుగురితో కలిసి ఒకే సమయంలో స్పేస్ లో ఉన్నవారి సంఖ్య 19కి చేరింది.

ఇంతకుముందెప్పుడూ వెళ్లలేదా?
ఇంతకుముందు 2023 మేలో ఒకే సమయంలో 17 మంది స్పేస్ లో ఉన్న ఘటన జరిగింది. అప్పట్లో కూడా ఐఎస్ఎస్ లో, చైనా స్పేస్ స్టేషన్ లో ఉన్నవారితోపాటు వర్జిన్ గెలాక్టిక్, ఆక్సియం స్పేస్ సంస్థలు ఒకే సమయంలో స్పేస్ ప్రయోగాలు చేపట్టడం దానికి కారణమైంది.

More Telugu News