Padi Kaushik Reddy: నాపై హత్యాయత్నం జరిగింది... విడిచిపెట్టే ప్రసక్తే లేదు: అరికెపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి నిప్పులు

Padi Koushik Reddy fires at Arikepudi Gandhi

  • చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న పాడి కౌశిక్ రెడ్డి
  • రేపు గాంధీ ఇంటికి వెళ్లి నిరసన తెలుపుతామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తెచ్చి దాడి చేశారని ఆగ్రహం

చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని, విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఆ ప్రతిచర్య ఎలా ఉంటుందనేది రేపే చూస్తారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు తనపై హత్యాయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరికెపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించిన సమయంలో ఉద్రిక్తత తలెత్తింది. గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

రేపు ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి నిరసన తెలుపుదామని... కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ తరలి రావాలని కోరారు. దాడి చేస్తే భయపడి పారిపోయే వ్యక్తిని కాదన్నారు.

కాంగ్రెస్‌ గూండాలు తనపై హత్యాయత్నం చేశారన్నారు. తన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని... ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తీసుకువచ్చారని విమర్శించారు. చంపే ప్రయత్నం చేస్తే.. మేమేందో కూడా చూపిస్తాం అని అన్నారు. గూండాలతో వచ్చి దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హారతులతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటే.. తమపై రాళ్ల దాడులు చేస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని, సామన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనా రేవంత్‌ రెడ్డీ? అని నిలదీశారు.

ఐదేళ్ల త‌ర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావ‌డం ఖాయమని... పార్టీ మారిన నేత‌ల సంగ‌తి అప్పుడు చూస్తామని హెచ్చరించారు. ఐదేళ్ల త‌ర్వాత కేసీఆర్ సీఎం కావ‌డం ఖాయమని, అప్పుడు మీ భ‌ర‌తం ప‌ట్టడం కూడా ఖాయమన్నారు. ఇది రాసిపెట్టుకోండన్నారు. ఇప్పుడు పార్టీ మారిన వారంద‌రికీ నాలుగేళ్ళ త‌ర్వాత సినిమా చూపిస్తామన్నారు. ప్ర‌తిప‌క్షానికి పీఏసీ ఇవ్వ‌డం ఆన‌వాయతీ అని... తాము అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్షానికి ఇచ్చామన్నారు. ఇప్పుడు హ‌రీశ్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్ దాఖ‌లు చేసిన నామినేష‌న్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు. నామినేష‌న్ దాఖ‌లు చేయ‌ని అరికెపూడి గాంధీకి దొంగ‌చాటున పీఏసీ ఎలా ఇస్తార‌ని నిలదీశారు.

అరికెపూడి మాట్లాడిన మాట‌ల‌ను ఆయ‌న విజ్ఞ‌త‌కే వదిలేస్తున్నానని... మైనంప‌ల్లి హ‌న్మంతరావు అల్వాల్‌లో మీటింగ్ పెట్టి ఇదే విధంగా కేటీఆర్‌ను దూషించారని గుర్తు చేశారు. కానీ 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారన్నారు. రేపు అరికెపూడికి ఆయన నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే గతి పడుతుందన్నారు. ఉప ఎన్నిక‌ల్లో కేసీఆర్ నాయ‌క‌త్వంలో తమ ద‌మ్మేందో చూపిస్తామన్నారు. 

  • Loading...

More Telugu News