Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే... కౌశిక్ రెడ్డి మీద రాళ్లు, టమాటాలతో దాడి: హరీశ్ రావు

Harish Rao demand CM apology for attack on Koushik Reddy
  • ఇదేం ప్రజాస్వామ్యం... ఇదేం ప్రజాపాలన... ఇదేం ఇందిరమ్మ రాజ్యమని నిలదీత
  • మా ఎమ్మెల్యేలను చేర్చుకొని వారినే ఉసిగొల్పి దాడి చేయిస్తారా? అని ఆగ్రహం
  • కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో తమ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి జరిగిందని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు హరీశ్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం... ఇదేం ప్రజాపాలన... ఇదేం ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దాడికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అరికెపూడి గాంధీ మందీ మార్బలంతో వెళ్లి కౌశిక్ రెడ్డి మీద రాళ్లు, గుడ్లు, టమాటాలతో దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది స్పష్టంగా తెలిసిపోతోందన్నారు. ఇంటి మీదకు వస్తామని ప్రెస్‌మీట్‌లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమయ్యాయని విమర్శించారు. 

పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలన్నారు.
Padi Kaushik Reddy
Harish Rao
Revanth Reddy
Telangana

More Telugu News