Mallu Bhatti Vikramarka: మార్చి నాటికి యాదాద్రి ప్లాంట్‌లో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలి: భట్టివిక్రమార్క
- యాదాద్రి పవర్ ప్లాంట్‌పై అధికారులతో భట్టివిక్రమార్క సమీక్ష
- భూమిని ఇచ్చిన వారిలో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని సూచన
- నిర్వాసితులకు త్వరగా పరిహారం చెల్లించాలన్న భట్టివిక్రమార్క
2025 మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పని చేయాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులకు సూచించారు. నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... ప్రాజెక్టు కోసం భూమిని ఇచ్చిన వారిని మనం గౌరవించాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేలోపు అర్హులైన వారికి శిక్షణను ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. భూనిర్వాసితులకు సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించాలన్నారు.
మార్చి నాటికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా పని చేయాలని, ఇందుకు అవసరమైన శ్రామికులను పెద్ద ఎత్తున సమకూర్చుకోవాలన్నారు. ప్లాంట్ నుంచి దామరచర్ల వరకు బొగ్గు రవాణా, ఇతర అవసరాల కోసం నిర్మిస్తున్న ఫోర్ లేన్ ప్రత్యేక రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.