Bandi Sanjay: రేవంత్ రెడ్డికి చేతకావడం లేదు... బీజేపీ గెలిస్తే కేసీఆర్‌కు చుక్కలు చూపించేవాళ్ళం: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Bandi Sanjay intresting commnts on kcr and revanth reddy

  • రేవంత్ రెడ్డి తోపు అనుకున్నాను.. కానీ కేసీఆర్‌ను జైల్లో పెట్టడం సాధ్యం కావడం లేదని వ్యాఖ్య
  • బీజేపీ గెలిస్తే అంకుశం సినిమాలో లాగా కేసీఆర్‌కు చుక్కలు చూపించేవాళ్లమన్న సంజయ్
  • కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టారన్న బీజేపీ ఎంపీ
  • హైడ్రా ఒక హైడ్రామా అంటూ వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తోపు అని అనుకున్నానని... కానీ కేసీఆర్‌ను జైల్లో పెట్టడం ఆయనకు సాధ్యం కావడం లేదని కేంద్ర సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శేరిలింగంపల్లిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ సంగతి చూసేవాళ్లమన్నారు. అంకుశం సినిమాలో లాగా కేసీఆర్‌ కుటుంబానికి చుక్కలు చూపించేవారమన్నారు. కానీ రేవంత్ రెడ్డికి చేతకావడం లేదన్నారు.

ఢిల్లీకి వెళ్లి ఎవరిని పట్టుకోవాలో వారిని పట్టుకుంటే కథ క్లోజ్ అవుతుందన్నారు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ మాత్రం ఆరితేరిన వ్యక్తి అన్నారు. ఎక్కడ ఎవరి జుత్తు పట్టుకోవాలో... ఎక్కడ ఎవరి కాళ్లు పట్టుకోవాలో కేసీఆర్‌కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. 

తెలంగాణకు పట్టిన దశమ గ్రహం కేసీఆర్... ఆయన నవగ్రహ యాగాలు చేయడమేంటని వ్యాఖ్యానించారు. తమపై నాన్ బెయిలబుల్, రౌడీషీట్ కేసులు పెట్టిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఓ వైపు వరదలకు తెలంగాణలోని ప్రజలు అల్లాడిపోతుంటే కేసీఆర్ మాత్రం రీఎంట్రీ కోసం యాగాలు చేయడం ఏమిటన్నారు. కేసీఆర్‌కు ప్రజలు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ బయటకే రావడం లేదన్నారు. హైడ్రాతో మంచి జరుగుతోందా... చెడు జరుగుతోందా? కానీ ఈ ఆంశంపై ఆయన స్పందించలేదని విమర్శించారు.

ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను కూల్చుతున్నారు సరే... మరి అనుమతులు ఇచ్చిన వారి సంగతి ఏమిటని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

More Telugu News