Narendra Modi: ప్రపంచంలోని ప్రతి డివైస్ లో భారత్‌లో తయారు చేసిన చిప్ ఉండాలనేది కల: ప్రధాని మోదీ
- దేశంలోనే 100 శాతం ఎలక్ట్రానిక్ తయారీ జరగాలన్న ప్రధాని మోదీ
- భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపు
- నోయిడాలో 'సెమికాన్ ఇండియా 2024' ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ వ్యాఖ్యలు
ప్రపంచంలోని ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ లో భారత్‌లో తయారు చేసిన చిప్ ఉండాలనేది తమ ఆకాంక్ష అని, దేశంలోనే 100 శాతం ఎలక్ట్రానిక్ తయారీ జరగాలన్నదే తమ కల అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో 'సెమికాన్ ఇండియా 2024'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెమీకండక్టర్ల రంగానికి చెందిన ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. భారత్‌ను సెమీ కండక్టర్ పవర్ హౌస్‌గా మార్చేందుకు చేయాల్సిందంతా చేస్తామన్నారు.
దేశంలో ప్రస్తుతం త్రీ డైమెన్షనల్ పవర్ ఉందన్నారు. అనుకూలమైన ప్రభుత్వం, తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం, ఆశావహ మార్కెట్... ఈ మూడు భారత్‌లో ఉన్నాయన్నారు. టెక్నాలజీ రుచి ఏమిటో తెలిసిన ఇలాంటి మార్కెట్ మరోచోట దొరకదన్నారు.
భారత్‌లో మార్కెట్ అనుకూల వాతావరణం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే సరఫరా గొలుసు అన్నింటికీ ముఖ్యమన్నారు. అలాంటి సరఫరా గొలుసును సృష్టించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు.
కరోనా సమయంలో ఈ విషయంలో భారత్‌కు ఎదురు దెబ్బలు తగిలాయని గుర్తు చేశారు. ఇప్పుడు భారత్‌లో కనుక పెట్టుబడులు పెడితే 21వ శతాబ్దంలో చిప్స్ కొరత రానే రాదన్నారు.
పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి... విలువను సృష్టించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు. చిప్ అంటే కేవలం సాంకేతికతకు మాత్రమే పరిమితం కాదని, కోట్లాదిమంది పౌరుల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమం అన్నారు.