Harish Rao: పసికందును కుక్కలు పీక్కుతిన్న ఘటన కలిచివేసింది: హరీశ్ రావు

Harish Rao lashes out at dog bites

  • కుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న మాజీ మంత్రి
  • కుక్కలు పీక్కుతింటున్న ఘటనపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని విమర్శ
  • కుక్కలు పీక్కుతినడం, కుక్కకాటు మరణాలు సర్వసాధారణమయ్యాయని ఆగ్రహం

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మగశిశువును కుక్కలు పీక్కుతున్న ఘటన తనను ఎంతో కలిచివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. బోధన్‌లో మగశిశువును కుక్కలు పీక్కుతున్నాయనే వార్త చదివి తాను ఎంతో ఆందోళనకు గురయ్యానన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు.

కుక్కకాటుకు రాష్ట్రంలో చిన్నారులు బలవుతున్నారన్నారు. పిల్లలను కుక్కలు పీక్కు తినడం, కుక్కకాటు మరణాలు సర్వసాధారణంగా మారిపోయాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఏడాది రాష్ట్రంలో 60 వేలకు పైగా కుక్క కాట్లు నమోదయ్యాయని లెక్కలు చెప్పారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారన్నారు. కనీసం యాంటీరేబిస్ ఇంజెక్షన్లను కూడా ప్రభుత్వం ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచలేకపోతోందని విమర్శించారు.

గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసిందని, చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిందన్నారు. మున్సిపాలిటీలో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధి కుక్కల నియంత్రణ లేక మనుషుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయన్నారు. 

రాష్ట్రంలో 20 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉంటే అందులో 10 లక్షలకు పైగా కుక్కలు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటాయన్నారు. రాష్ట్రంలో కుక్కల బెడద విపరీతంగా ఉందన్నారు. వాటి స్టెరిలైజేషన్ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. కుక్కకాటుతో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Harish Rao
Dog
Telangana
  • Loading...

More Telugu News