Jayam Ravi: జయం రవి విడాకుల ప్రకటనపై భార్య ఆరతి షాక్.. సంచలన వ్యాఖ్యలు

Jayam Ravi Divorce Announcement Shocked Wife Aarti

  • భార్య నుంచి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన జయం రవి
  • తనకు తెలియకుండానే ఆ ప్రకటన చేశాడన్న ఆర్తి
  • విభేదాలను సామర్యంగా పరిష్కరించే ప్రయత్నం చేశానని వెల్లడి
  • అన్యాయంగా తనపై వేస్తున్న నిందలను భరించడం కష్టంగా ఉందన్న ఆర్తి

భార్య నుంచి విడాకులు తీసుకున్నట్టు నటుడు జయం రవి ప్రకటించిన రెండ్రోజుల తర్వాత ఆర్తి స్పందించారు. నేడు ఆమె ఓ స్టేట్‌మెంట్ విడుదల చేస్తూ.. రవి తనకు తెలియకుండానే ఈ ప్రకటన చేసినట్టు ఆమె పేర్కొన్నారు. అది చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండానే విడాకులపై ఆయన ప్రకటన చేశారని ఆరతి పేర్కొన్నారు. విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని, తాము 18 ఏళ్లు కలిసి ఉన్నామని తెలిపారు. ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని తనకు తెలియకుండా ప్రకటించడం ఎంతో బాధించిందన్నారు.

తమ మధ్య నెలకొన్న మనస్పర్థలను, విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించానని, భర్తతో నేరుగా మాట్లాడే చాన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తు తనకు ఆ అవకాశం దక్కలేదన్నారు. జయం రవి ప్రకటన చూసి తాను, పిల్లలు షాకయ్యామని, ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని ఆర్తి పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల తమకు ఏమాత్రం మంచి జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ కలిగినా తాను గౌరవంగానే ఉండాలని అనుకుంటున్నానని, అందుకే బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదని వివరించారు.

అన్యాయంగా తనపై వేస్తున్న నిందలను భరించడం కష్టంగా ఉందని, తనను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆర్తి వాపోయారు. ఒక తల్లిగా తన తొలి ప్రాధాన్యం ఎప్పుడూ పిల్లల శ్రేయస్సేనని, ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. అయితే, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు. తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని, తమ గోప్యతకు భంగం కలిగించద్దని ఆర్తి విజ్ఞప్తి చేశారు.

More Telugu News