Godavari River: ఉప్పొంగుతున్న గోదావరి.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

Godavari River danger level at Rajamundry

  • ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద
  • పాపికొండల విహార యాత్రకు బ్రేక్
  • జలదిగ్బంధంలో లంక గ్రామాలు

గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో పాపికొండల యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

పి.గన్నవరం మండలం, మామిడికుదురు మండలాల్లో కాజ్ వేలు నీట మునిగాయి. జనం నాటుపడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో పలు గ్రామాలను వరద ముంచెత్తింది. చింతూరు మండలంలో 22 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వీఆర్‌ పురం మండలంలోని ప్రధాన రహదారులను వరద ముంచెత్తడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తూర్పుగోదావరి, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సీతానగరం మండలంలోని ములకల్లంక, రాజమండ్రి అర్బన్ మండలం బ్రిడ్జిలంక, కేతవారిలంక, వెదురు లంక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

More Telugu News