Virat Kohli: ధోనీ కట్టడికి కోహ్లీ సలహా... ఆసక్తికర విషయం చెప్పిన యంగ్ పేసర్ యశ్ దయాళ్

Virat Kohli gave Masterplan to stop MS Dhoni In IPL 2024 says RCB Star Yash Dayal

  • ఐపీఎల్ 2024లో ఒక మ్యాచ్‌ చివరి ఓవర్‌‌లో దయాళ్ వేసిన తొలి బంతికే సిక్సర్ బాదిన ధోనీ
  • బంతులు స్లోగా వేయాలని పేసర్‌కు సూచించిన కోహ్లీ
  • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్న పేసర్ యశ్ దయాళ్

బంగ్లాదేశ్‌తో టీమిండియా త్వరలో ఆడబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌కు ఆర్సీబీ స్టార్ పేసర్ యశ్ దయాళ్ ఎంపికైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌, అవహేళనకు గురైన ఈ ఆటగాడు భారత జట్టుకు తొలిసారి ఎంపికవడం ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలో క్రికెట్ కెరీర్‌లో తన ఎదుగుదల పరిణామంపై ‘న్యూస్ 24’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్ దయాళ్ పలు ఆసక్తికరమైన విషయాలను గుర్తుచేసుకున్నాడు. 

ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో తాను వేసిన తొలి బంతిని ధోనీ భారీ సిక్సర్ బాదాడని, అయితే అతడిని కట్టడి చేసేందుకు విరాట్ కోహ్లీ ఎంతో మంచి సలహా ఇచ్చాడని దయాళ్ గుర్తుచేసుకున్నాడు. వ్యూహాన్ని మార్చాలని సూచించాడని పేర్కొన్నాడు.

‘‘మహీ భాయ్‌కి మాంచి పేస్ తో కూడిన బంతులు వేస్తే ప్రయోజనం ఉండదని విరాట్ భయ్యా నాతో చెప్పాడు. ఎందుకంటే ధోనీ పేస్‌ బౌలింగ్‌ ఆడడానికి ఇష్టపడతాడు. తొలి బంతిని సిక్స్ కొట్టిన తర్వాత నన్ను ప్రశాంతంగా ఉండాలని కోహ్లీ చెప్పాడు. అతడితో మాట్లాడడం నాకు చాలా సహాయపడింది’’ అని దయాళ్ వివరించాడు. కాగా ఆ తర్వాత దయాల్ బౌలింగ్‌లోనే ధోనీ ఔట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో విజయం సాధించడంతో అనూహ్య రీతిలో ప్లేఆఫ్‌కు కూడా అర్హత సాధించింది.

విరాట్ కోహ్లీ చాలా దూకుడుగా ఉంటాడనేలా సోషల్ మీడియాలో చిత్రీకరిస్తుంటారని, కానీ వాస్తవం అది కాదని యశ్ దయాళ్ వివరించాడు. కోహ్లీతో మాట్లాడడానికి తాను ప్రయత్నించానని, కానీ అతడే స్వయంగా వచ్చి చాలా విషయాలు చెప్పాడని ప్రస్తావించాడు. ప్రదర్శనతో సంబంధం లేకుండా జట్టులో తనకు తప్పుకుండా చోటు దక్కుతుందంటూ కోహ్లీ ప్రోత్సహించాడని పేర్కొన్నాడు. 

‘‘నేను ఎలా రాణించినా సీజన్ అంతటా ఆర్సీబీ జట్టు యావత్తు మద్దతు ఇస్తుందని విరాట్ చెప్పి నాపై ఒత్తిడి తగ్గించాడు. నేను ఆర్సీబీకి ఎప్పుడు ఆడినా ముఖంలో చిరునవ్వు ఉండాలని చెప్పాడు. మైదానంలో ఉత్సాహంగా ఉండాలని సూచించాడు’’ అని యశ్ దయాళ్ పేర్కొన్నాడు. మొత్తంగా ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ తనకు చాలా సహాయ పడ్డాడని దయాళ్ వివరించాడు. కాగా గత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున యశ్ దయాళ్ రాణించి అందరి ప్రసంశలు అందుకున్నాడు.

  • Loading...

More Telugu News