Sridhar Babu: అరికెపూడికి ఆ పదవి ఎలా ఇస్తారన్న ప్రశాంత్ రెడ్డి... మీ మధ్య విభేదాలతో మాకేం సంబంధమన్న శ్రీధర్ బాబు
- పీఏసీ చైర్మన్ పదవి మొదటి నుంచి ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయతీ అన్న బీఆర్ఎస్
- పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఎలా ఇస్తారని ప్రశ్న
- శాసనసభ నియామల ప్రకారమే పదవి ఇచ్చామన్న శ్రీధర్ బాబు
- చైర్మన్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అభిప్రాయభేదాలు ఉంటే తమకు సంబంధం లేదని వ్యాఖ్య
పీఏసీ చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించడంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చే సంప్రదాయం మొదటి నుంచి వస్తోందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కానీ, అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఈ పదవిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ లోపాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపకుండా ఉండేందుకే అరికెపూడికి ఈ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు.
తమ పార్టీ నేత హరీశ్ రావు ఈ పదవి కోసం నామినేషన్ వేస్తే తిరస్కరించారని మండిపడ్డారు. పీఏసీ చైర్మన్ పదవి కోసం నాలుగు నామినేషన్లు వచ్చినప్పటికీ ఎన్నికలు ఎందుకు జరపలేదో చెప్పాలని నిలదీశారు. అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం ప్రపంచానికి తెలుసని అన్నారు. మరలాంటప్పుడు... విపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన పదవిని ఆయనకు ఎలా ఇస్తారని మండిపడ్డారు. లోక్ సభలో విపక్ష కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ను పీఏసీ చైర్మన్‌గా నియమించారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక రాజ్యాంగం... తెలంగాణలో మరో రాజ్యాంగం ఉందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ రక్షణ అని పదేపదే పలుకుతున్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని నిలదీశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము ఇచ్చిన పిటిషన్ సభాపతి వద్ద ఉందని, పెండింగ్‌లో ఉన్నప్పుడు పదవి ఇవ్వడమేమిటన్నారు. పీఏసీలో హరీశ్ రావు ఉండాలనుకుంటే అధికార పార్టీ ఎందుకు భయపడుతుందో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డివి శిఖండి రాజకీయాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ మధ్య అభిప్రాయభేదాలు ఉంటే మాకేం సంబంధం?
పీఏసీ చైర్మన్ పదవిపై ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. శాసనసభ నియమాల ప్రకారమే నియామకం జరిగిందని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని గాంధీ చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతలతో పీఏసీ చైర్మన్‌కు అభిప్రాయభేదాలు ఉంటే తమకు సంబంధం లేదన్నారు. ప్రభుత్వాన్ని నడపడమే తమ బాధ్యత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో... ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు.