Toll Charges: టోల్ ట్యాక్స్ నిబంధనల్లో కీలక మార్పు... ప్రైవేటు వాహనదారులకు గుడ్‌న్యూస్

private vehicle owners will not incur any toll charges for travelling up to 20 kilometres on highways

  • ఒక రోజులో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే టోల్ విధించబోమని ప్రకటన
  • జీఎన్ఎస్ఎస్ సౌలభ్యం ఉన్న వాహనాలకు వర్తింపు
  • నిబంధనలను సవరించిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ

ప్రైవేటు వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు గుడ్‌న్యూస్ చెప్పింది. వాహనానికి జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) సౌలభ్యం కలిగిన వాహనదారులు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ రహదారులపై రోజుకు 20 కిలోమీటర్ల దూరం ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే ప్రయాణించవచ్చని ప్రకటించింది. 

అయితే ప్రయాణం 20 కిలోమీటర్లకు మించితే మొత్తం ప్రయాణించిన దూరానికి టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త నోటిఫికేషన్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ స్పష్టం చేసింది. ప్రైవేటు వాహనదారులకు ప్రయోజనం కల్పిస్తూ ఈ మేరకు జాతీయ రహదారుల ఫీజుల నిబంధనలు-2008ను సవరించినట్టు వెల్లడించింది. ఆ మేరకు జీఎన్‌ఎస్ఎస్ సౌలభ్యం ఉన్న వాహనదారులకు ప్రయోజనం చేకూర్చేలా జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు-2024ను కొత్తగా అప్‌డేట్ చేశామని వివరించింది.

నేషనల్ పర్మిట్ ఉన్న వాహనాలు మినహా ఇతర వెహికల్స్ ఒక రోజులో జాతీయ రహదారులు, బైపాస్ లేదా సొరంగం గుండా ప్రయాణిస్తే వాహన డ్రైవర్ లేదా యజమాని ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని... అన్ని దిశల్లో 20 కిలోమీటర్ల ప్రయాణ దూరం మినహాయింపుగా ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

కాగా ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్ విధానంతో పాటు పైలట్ ప్రాజెక్ట్‌గా జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రహదారి మంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. పైలెట్ ప్రాజెక్టులుగా రెండు చోట్ల పరీక్షించిన అనంతరం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

More Telugu News