Mohammad Shami: బంగ్లాదేశ్‌తో టెస్టుకు అయ్యర్, షమీలను ఎందుకు పక్కనపెట్టారు? కారణాలు ఇవేనా...!

many have been wondering why Mohammad Shami and Shreyas Iyer could not make entry for 1st test against Bangladesh

  • గాయం నుంచి కోలుకున్నా... ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉన్న షమీ
  • టెస్టుల్లో నిలకడ లేమి ప్రదర్శనతో అయ్యర్‌ను పక్కన పెట్టిన సెలక్టర్లు
  • సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ ఫామ్‌లో ఉండడంతో వారిని ఎంపిక చేసిన సెలక్టర్లు

భారత్ - బంగ్లాదేశ్‌ జట్ల మధ్య సెప్టెంబర్ 19న చెన్నై వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు బీసీసీఐ జట్టుని ప్రకటించింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి స్టార్ ప్లేయర్లు తిరిగి టెస్ట్ జట్టులో అడుగుపెట్టారు. అంతేకాదు యువ బౌలర్ యశ్ దయాల్ కు కూడా సెలక్టర్లు చోటు ఇచ్చారు. 

అయితే తిరిగి జట్టులోకి వస్తాడని భావించిన స్టార్ మహ్మద్ షమీ, ఇటీవలే దులీప్ ట్రోఫీలో ఫామ్‌లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌లను సెలక్టర్లు విస్మరించారు. దీంతో మొదటి టెస్టుకు జట్టుని ప్రకటించిన నాటి నుంచి మహ్మద్ షమీ, అయ్యర్‌లను ఎంపిక చేయకపోవడంపై క్రికెటర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఫిట్‌నెస్ సాధించాల్సి ఉందని భావించవచ్చు. కానీ ఫామ్‌ను అందిపుచ్చుకున్న శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణాలు ఏమిటనే చర్చ నడుస్తోంది. అయితే వీరిద్దరినీ ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను ప్రస్తావిస్తూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది.

శ్రేయాస్ అయ్యర్ ఇటీవల ఫామ్‌లోకి వచ్చినప్పటికీ టెస్ట్ క్రికెట్‌లో అతడు నిలకడగా ప్రదర్శనలు చేయలేకపోతుండడం, 2024 సీజన్‌లో ప్రదర్శన పేలవంగా ఉండడం వంటి కారణాలతో సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది. ఫిట్‌నెస్ ఆందోళనలను కూడా లెక్కలోకి తీసుకున్నారని ప్రస్తావించింది. 

ఇక, గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ముంబయి జట్టుకి అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వంటి మిడిలార్డర్ బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉండడం కూడా అయ్యర్ పేరును పరిగణనలోకి తీసుకోకపోవడానికి ఒక కారణమని సమాచారం.

ఇక స్టార్ పేసర్ మహ్మద్ షమీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉన్నందున అతడిని పక్కన పెట్టినట్టు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం పేర్కొంది. అక్టోబర్ 11న ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడి ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అతడిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. 

కాగా, షమీ బంగ్లాదేశ్ సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గతంలో అన్న విషయం తెలిసిందే.

More Telugu News