Apophis: భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం... క్రికెట్ స్టేడియం కంటే పెద్దదంటున్న ఇస్రో చీఫ్

Asteroid called Apophis is moving towards Earth says ISRO Chife Somanath

  • 2029లో భూమికి సమీపం నుంచి ప్రయాణించనున్న అపోఫిస్ అనే గ్రహశకలం
  • దీనిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు చెప్పిన ఇస్రో చీఫ్ సోమనాథ్
  • భూమికి పొంచివున్న ముప్పుని నివారించేందుకు ఏ దేశానికైనా సహకరిస్తామని వెల్లడి

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దగా ఉన్న ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని, దీనిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇస్రో చీఫ్ డా.ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఈ ఆస్టరాయిడ్ పేరు ‘అపోఫిస్’ అని, 2029 ఏప్రిల్ 13న ఇది భూమికి అతి సమీపం నుంచి ప్రయాణించనుందని చెప్పారు. 

భూమికి 32,000 కిలోమీటర్ల ఎత్తులో వెళుతుందని, అంటే భారత జియోస్టేషనరీ శాటిలైట్స్ పరిభ్రమించే కక్ష్యల కంటే దగ్గరగా ఈ ఆస్టరాయిడ్ ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. 

ఇక, పరిమాణం పరంగా చూస్తే ఇంత పెద్ద గ్రహశకలం గతంలో ఎప్పుడూ భూమికి ఇంత సమీపం నుంచి వెళ్లలేదని వివరించారు. ఇది భారత అతిపెద్ద విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే కూడా పెద్దగా ఉంటుందని చెప్పారు. ఈ గ్రహశకలం పరిమాణం సుమారు 340-450 మీటర్ల వ్యాసం కలిగి ఉండొచ్చని చెప్పారు. 140 మీటర్ల వ్యాసం కంటే పెద్దగా ఉన్న ఏ గ్రహశకలం భూమికి సమీపం నుంచి ప్రయాణించినా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారని సోమనాథ్ చెప్పారు.

ఒక భారీ ఆస్టరాయిడ్ మానవాళి మనుగడకు ముప్పు అని, ఆ ముప్పును ఎదుర్కొనే విషయంలో ఇస్రో క్రియాశీలకంగా ఉందని ఆయన చెప్పారు. నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ (NETRA) ఆస్టరాయిడ్ 'అపోఫిస్‌'ను నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో భూమికి పొంచివుండే ముప్పులను నివారించేందుకు భారత్ సిద్ధమని, ఈ మేరకు అన్ని దేశాలకు తమ సహకారం అందిస్తామని సోమనాథ్ చెప్పారు. 

300 మీటర్ల కంటే పెద్దగా ఉంటే గ్రహశకలం ఖండాలను నాశనం చేసే అవకాశం ఉంటుందని, ఇక 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యాసం ఉండే గ్రహశకలాలు ఢీకొంటే భూమి వినాశనం అవుతుందని చెప్పారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘అపోఫిస్‌’ను తొలిసారి 2004లో గుర్తించారు. విలయాలు సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించే ‘అపోఫిస్’ అనే దేవుడి పేరును ఈ గ్రహశకలానికి పెట్టారు. ఈ గ్రహశకలం ముప్పు నుంచి తప్పించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా కృషి చేస్తోంది.

More Telugu News