Virender Sehwag: రోహిత్‌, కోహ్లీ, ధోనీ ముగ్గురిలో ఎవ‌రు బెస్ట్? అంటే వీరేంద్ర సెహ్వాగ్ స‌మాధానం ఇదే!

Dhoni vs Virat vs Rohit Virender Sehwag Makes His Choice is Rohit Sharma

  • ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఫైన‌ల్‌కు హాజ‌రైన భార‌త మాజీ క్రికెట‌ర్‌
  • ఈ సంద‌ర్భంగా సెహ్వాగ్‌కు ర్యాపిడ్ ఫైర్ ప్ర‌శ్న‌లు అడిగిన వ్యాఖ్యాత‌
  • దీనిలో భాగంగా వీరూకు రోహిత్‌, కోహ్లీ, ధోనీ ముగ్గురిలో ఎవ‌రు బెస్ట్ అనే ప్ర‌శ్న‌
  • చివ‌రికి రోహిత్‌నే బెస్ట్‌గా ఎంచుకున్న‌ సెహ్వాగ్

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఇది లేదా అది అనే ర్యాపిడ్ ఫైర్‌ ఛాలెంజ్ ట్రెండ్ న‌డుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీ ఫైన‌ల్ సంద‌ర్భంగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. 

కొంద‌రు ప్ర‌ముఖ క్రికెట‌ర్ల పేర్ల నుంచి ది బెస్ట్ క్రికెట‌ర్‌ ఎంపిక కోసం వ్యాఖ్యాత వీరూకు ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ సంద‌ర్భంగా సెహ్వాగ్‌కు  ముగ్గురు భారత ఆటగాళ్ల పేర్లు ఎదుర‌య్యాయి. వారే విరాట్ కోహ్లీ, మ‌హేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ. ఈ ముగ్గురిలో చివరికి ఆయ‌న హిట్‌మ్యాన్‌కే ఓటు వేశారు.

మొద‌ట ఎంఎస్ ధోనీ, బెన్ స్టోక్స్ మధ్య ఎంపికతో ఈ ఛాలెంజ్ మొద‌లైంది. దాంతో సెహ్వాగ్‌.. భారత మాజీ కెప్టెన్ వైపు మోగ్గు చూపాడు. ఆ త‌ర్వాత‌ దక్షిణాఫ్రికా క్రికెట‌ర్ ఏబీ డివిలియర్స్, ధోనీ మ‌ధ్య పోలిక వ‌చ్చింది. దాంతో వీరేంద్రుడు డివిలియ‌ర్స్‌ను ఎంచుకున్నాడు. 

అనంత‌రం సెహ్వాగ్‌ను డివిలియర్స్, విరాట్ కోహ్లి మధ్య ఎంపిక చేయమని కోర‌గా.. ర‌న్ మెషిన్‌ను ఎంచుకున్నాడు. ఆ వెంట‌నే కోహ్లీ, రోహిత్ శర్మ మ‌ధ్య ప్ర‌శ్న ఎదురైంది. దాంతో వీరూ ప్రస్తుత టీమ్ ఇండియా వన్డే, టెస్ట్ కెప్టెన్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇలా చివ‌రికి రోహిత్‌నే మేటి ఆటగాడిగా సెహ్వాగ్ ఎంచుకోవ‌డం జ‌రిగింది. 

ఇదిలాఉంటే.. గతేడాదితో పాటు అంత‌కుముందు కూడా రోహిత్ శర్మ త‌నదైన ఆటతీరు, కెప్టెన్సీతో జట్టును ముందుండి న‌డిపిస్తున్న విష‌యం తెలిసిందే. దాంతో హిట్‌మ్యాన్ స్థాయి అమాంతం పెరిగింది. ముఖ్యంగా అతను టీమిండియాను స్వ‌దేశంలో జ‌రిగిన‌ వ‌న్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్‌కు తీసుకెళ్ల‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. కానీ, భార‌త్ ఫైన‌ల్‌లో ఆసీస్ చేతిలో ప‌రాజ‌యం పొందింది. 

ఇక రోహిత్ త‌న సారథ్యంలోనే ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ అందించాడు. ఈ టోర్నీలో కెప్టెన్సీతో పాటు ఆట‌గాడిగానూ జ‌ట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒక దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో ఇండియా ఓడిపోవ‌డం ఖాయం అని అనుకున్నారంతా. కానీ, చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో త‌న కెప్టెన్సీ చ‌తుర‌తతో భార‌త జ‌ట్టును హిట్‌మ్యాన్‌ విజేతగా నిలిపాడు.

More Telugu News