Telangana: తెలంగాణ పట్ల కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది: హరీశ్ రావు
- మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో అన్యాయం జరుగుతోందన్న హరీశ్ రావు
- కొన్ని రాష్ట్రాలకు నిధులు తక్కువగా ఇస్తామని చెప్పడం సరికాదని వ్యాఖ్య
- పన్నుల వాటా కేటాయింపులో కేంద్రం పాటిస్తున్న విధానాలు సరిగ్గా లేవన్న మాజీ మంత్రి
తెలంగాణ పట్ల కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. 16వ ఆర్థిక సంఘం సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు కేంద్రం నిధుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. కొన్ని రాష్ట్రాలకు నిధులు తక్కువగా ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. బాగా ఉన్న రాష్ట్రాలు మరింత బాగా పని చేసేలా ప్రోత్సహించాలన్నారు. కానీ గొంతు నొక్కవద్దని ఆర్థిక సంఘాన్ని కోరినట్లు చెప్పారు. పన్నుల వాటా కేటాయింపులో కేంద్రం పాటిస్తున్న విధానాలు సరిగ్గా లేవన్నారు.
ఆర్థిక సంఘానికి పలు ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రాలకు నిధుల విభజనలో ప్రస్తుత కొలమానాలు మారాలని సూచించినట్లు తెలిపారు. ప్రస్తుత విధానం ప్రకారం బాగున్న రాష్ట్రానికి తక్కువ నిధులు వచ్చేలా ఉందన్నారు. దీంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. పన్నుల వాటా కేటాయింపులలో కేంద్రం విధానాల కారణంగా... పట్టణీకరణ పెరుగుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతోందన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఎత్తిపోతలు వంటి పథకాలు మాత్రమే సాధ్యమని... అలాంటి వాటికి నిధులు కేటాయించాలని కోరారు.
ఇంటింటికీ నీరు ఇవ్వడానికి కేంద్రం హర్ ఘర్ జల్ పథకాన్ని తీసుకువచ్చిందని, కానీ తెలంగాణ దీనిని మిషన్ భగీరథ రూపంలో అంతకుముందే అమలు చేసిందన్నారు. మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా ఇవ్వలేదని మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం చేసిన సూచనల్లో ఒక్కదాన్ని కూడా కేంద్రం పాటించలేదని విమర్శించారు.