Chandrababu: ఆ రోజు ప్రజలు నా వెంట ఉన్నారు... వారి కోసం జీవితాన్ని అంకితం చేసి పని చేస్తాను: చంద్రబాబు

Chandrababu says will work for people of AP

  • గత ఏడాది తనను అక్రమంగా అరెస్ట్ చేసిన రోజున ప్రజలు తన వెంట ఉన్నారన్న సీఎం
  • తొమ్మిది రోజులుగా ప్రజల మధ్య బస్సులోనే ఉన్నానన్న చంద్రబాబు
  • అధిక వర్షాలు, గత పాలకుల పాపాలు విజయవాడకు శాపంగా మారాయని ఆవేదన

గత ఏడాది ఇదే రోజున నాటి వైసీపీ ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఆ రోజు ప్రజలంతా తన వెంటే నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనపై అంతటి ఆదరణ చూపిన ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి పని చేస్తానన్నారు. ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... ప్రజలకు కష్టం వస్తే తొమ్మిది రోజులుగా వారి మధ్య... బస్సులోనే ఉన్నానన్నారు. వారి మధ్యే ఉంటూ వారి కోసం పని చేస్తానని వ్యాఖ్యానించారు.

అధిక వర్షాలు, గత పాలకుల పాపాలు ఇప్పుడు విజయవాడ ప్రజలకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు నుంచి కొల్లేరుకు నీరు వెళ్లకుండా కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సర్వశక్తులు ఒడ్డి ప్రజలను కొంత వరకు ఆదుకున్నట్లు చెప్పారు. ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేసినట్లు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు అండగా నిలుస్తామన్నారు.

తాము ఇంత చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం తమపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అయినా తనకు వచ్చిన ఇబ్బంది లేదని... తనకు ఏడు లక్షల మంది వరద బాధితుల కష్టాలే కనిపిస్తున్నాయన్నారు. వరద ప్రాంతాల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. వరద ప్రాంతాల్లోని ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News