G. Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

Kishan Reddy open letter to CM Revanth Reddy

  • తెలంగాణలో అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి
  • చర్లపల్లి రైల్వే టెర్మినల్స్‌కు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకరించాలన్న కేంద్రమంత్రి
  • రేతిఫైల్, ఆల్ఫా హోటల్ వద్ద ఇరుకుగా ఉన్న రోడ్ల విషయమై చొరవ చూపాలన్న కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేంద్రం చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సహకరించాలని అందులో కోరారు. తెలంగాణలో రైల్వేలు, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న చర్యలకు సహకారం ఉండాలని కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే టెర్మినల్స్‌కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు.

మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి పదేళ్లుగా ఆ దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి మిషన్ మోడ్‌లో పూర్తవుతోందని పేర్కొన్నారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్‌తో పాటు లైన్ల ఎలెక్ట్రిఫికేషన్ పనులు, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలోని రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లిలో రూ.415 కోట్లతో రైల్వే టెర్మినల్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణం పూర్తైతే పాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.715 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి అత్యాధునిక వసతులతో దీన్ని ప్రజలకు అంకితం చేయనున్నామన్నారు. రేతిఫైల్, ఆల్ఫా హోటల్ వద్ద రోడ్లు ఇరుకుగా ఉండి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయమై చొరవ చూపాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

More Telugu News