Bandi Sanjay: కూల్చివేతలు... హైడ్రాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
- వ్యాపారుల దుకాణాలు, పేదల ఇళ్లు కూల్చుతున్నారని ఆగ్రహం
- అనుమతులు ఇచ్చిన వారిని ఏమీ చేయడం లేదని మండిపాటు
- హైడ్రా పేరుతో హామీల నుంచి దృష్టి మళ్లిస్తున్నారన్న బండి సంజయ్
హైడ్రాపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు హైడ్రాను సమర్థించేవారు కూడా ఇప్పుడు వ్యతిరేకించే పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. పొట్టకూటి కోసం షాపులను అద్దెకు తీసుకొని వ్యాపారం చేసుకుంటుంటే... హైడ్రా హఠాత్తుగా వచ్చి నిర్మాణాలను కూల్చి వేస్తోందని ఆరోపించారు. ముందు నోటీసులు ఇస్తే వారే ఖాళీ చేసుకొని వెళ్లిపోయే అవకాశం ఉంటుందన్నారు. కానీ హఠాత్తుగా వెళ్లి కూల్చడమేమిటని మండిపడ్డారు.
కరీంనగర్ క్లాక్ టవర్ వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అన్ని అనుమతులు తీసుకున్నాకే పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని, అలాంటి వారి నిర్మాణాలను కూల్చడమేమిటని మండిపడ్డారు. అనుమతులు ఇచ్చిన వారిని ఏమీ చేయడం లేదని... పెద్దల నిర్మాణాలను ముట్టుకోవడం లేదన్నారు. ఒక్క పెద్దవాడి నిర్మాణం కూల్చి సినిమా చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మొత్తానికి హైడ్రా పేరు చెప్పి రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారెంటీల నుంచి ప్రభుత్వం దృష్టి మళ్లించిందని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలాడుతోందన్నారు. కొన్ని రోజులుగా హైడ్రా తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు. సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను మొదట హైడ్రాను సమర్థించానని గుర్తు చేశారు. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌస్ లను కూలిస్తే సమర్థించామని, కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే వారి షాపులను, పేదల ఇళ్లను కూలిస్తే ఊరుకునేది లేదన్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు కూలుస్తున్నారు? అని ప్రశ్నించారు.