Kakani Govardhan Reddy: చంద్రబాబు ఇల్లు మునిగింది.. అందుకే కలెక్టరేట్ లో ఉంటున్నారు: కాకాణి

Chandrababu is staying in relief camp Collectorate says Kakani Govardhan

  • నీటిని విడుదల చేయాలని అధికారులు చెపుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్న కాకాణి
  • జగన్ నీళ్లలోకి దిగిన తర్వాతే చంద్రబాబు నీళ్లలోకి దిగారని ఎద్దేవా
  • వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శ

వరద నివారణ చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎప్పుడూ రియల్ టైమ్ గవర్నెన్స్ గురించి మాట్లాడే చంద్రబాబు వరద తీవ్రతను ఎందుకు అంచనా వేయలేకపోయారని ప్రశ్నించారు. బుడమేరుకు 1964లోనే వరద వచ్చిందని... అప్పుడు 10 మంది మృతి చెందారని తెలిపారు. భారీ వరద వచ్చే అవకాశం ఉందని, నీటిని విడుదల చేయాలని అధికారులు చెపుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. 

ముంపు ప్రాంతాల్లో ఉండే వారిని పునరావాస కేంద్రాలకు ఎందుకు తరలించలేదని కాకాణి ప్రశ్నించారు. చంద్రబాబు తన ఇంటి నుంచి పునరావాస కేంద్రమైన కలెక్టరేట్ కి వెళ్లారని చెప్పారు. చంద్రబాబు ఇల్లు నీటిలో మునిగిందని... అందుకే ఆయన తన ఇంటికి పోవడం లేదని... వరదలు తగ్గిన తర్వాతే ఇంటికి వెళ్తానని చెపుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మోకాలు లోతు నీళ్లలోకి దిగిన తర్వాతే చంద్రబాబు నీళ్లలోకి దిగారని చెప్పారు. 

వైసీపీ హయాంలో తీసుకొచ్చిన రేషన్ వాహనాలనే ఇప్పుడు ప్రభుత్వం వాడుతోందని కాకాణి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీని వైసీపీ నేతలకు చెందిన బోట్లు ఢీకొన్నాయని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైల్వే ట్రాక్ పక్కన చంద్రబాబు నిలబడితే... చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం అని ప్రచారం చేసుకున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో హైడ్రా చర్యలను పచ్చ మీడియా ప్రశంసిస్తోందని... గతంలోనే జగన్ అక్రమ కట్టడాలను కూల్చడం ప్రారంభించారని చెప్పారు.

More Telugu News