G Jagadish Reddy: ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడటం ఖాయం... ఉపఎన్నికలు వస్తాయి: జగదీశ్ రెడ్డి

Jagadeesh Reddy says byelections will come in Telangana

  • ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పును స్వాగతించిన మాజీ మంత్రి
  • హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా ఉందన్న జగదీశ్ రెడ్డి
  • ప్రజాకోర్టులో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశిస్తూ తీర్పును వెలువరించింది. ఆలోగా నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా తీసుకొని విచారిస్తామని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై జగదీశ్ రెడ్డి స్పందించారు.

ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా కోర్టు తీర్పు ఉందన్నారు. ఎమ్మెల్యేల అన‌ర్హత పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. ప్రజాకోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని జోస్యం చెప్పారు. అప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని, ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ అంటేనే భయపడేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం కాకుండా అడ్డగోలుగా బుల్డోజర్లతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజకీయ కక్షసాధింపుతో హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారన్నారు. సీఎం చర్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల విషయంలో ఒకలా పెద్దల విషయంలో మరోలా హైడ్రా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

More Telugu News